పాత పథకాలకు పాయే.. కొత్త పథకాలకే రేవంత్ జై!
ఇక, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం.. ప్రకటించిన పథకాలకు మాత్రమే తాజాగా ప్రకటించిన ఏడు మాసాల బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.
By: Tupaki Desk | 25 July 2024 11:30 AM GMTబీఆర్ ఎస్ పార్టీ హయాంలో తీసుకువచ్చిన పలు పథకాలకు తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.ముఖ్యంగా రైతు బంధు, దళిత బంధు పథకాలను వదిలేసింది. వీటి స్థానంలో ఒక్క రైతు భరోసా ను తీసుకువచ్చినా.. దీనికి గాను ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఇక, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం.. ప్రకటించిన పథకాలకు మాత్రమే తాజాగా ప్రకటించిన ఏడు మాసాల బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మిగిలిన పథకాలను చూస్తే.. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.723 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు, ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు కేటాయించారు. అయితే.. ప్రజారవాణా ద్వారా.. జరుగుతున్న ఆర్టీసి నష్టంపై ప్రభుత్వం స్పందించలేదు. దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించ లేదు. అదేవిధంగా మహిళలకు రూ.1000 చొప్పున నెలకు ఇస్తామన్న పథకాన్ని కూడా ప్రస్థావించలేదు.
శాఖలకు కేటాయింపులు..
శాఖలకు మాత్రం కొంత మేరకు నిధులు కేటాయించారు. ఉద్యానవన శాఖకు రూ.737 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,980 కోట్లు, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,836 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,816 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.9,200 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు: రూ.11,468 కోట్లు, విద్యుత్‌కు రూ.16,410 కోట్లు, అటవీ శాఖకు రూ.1,064 కోట్లు చొప్పున కేటాయించారు. నీటి పారుదల శాఖకు. రూ.22,301 కోట్లు, ఆర్ అండ్ బీ శాఖకు రూ.5,790 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు, విద్యా శాఖకు రూ.21,292 కోట్లు, హోంశాఖకు రూ.9,564 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.72,659 కోట్లు కేటాయించారు.
వివిధ అభివృద్ధి పనులకు..
విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు(కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు) మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు రూ.1525 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్సుపోర్ట్ సిస్టమ్ కు రూ.50 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు రూ.200 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు, హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు కేటాయించారు. ఇక, అత్యంత కీలకమైన ఐటీ రంగానికి రూ.774 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.