Begin typing your search above and press return to search.

తెలంగాణలో అందరి కళ్లూ ఆ ఒక్క నియోజకవర్గం పైనే

అయితే, తాజాగా ఆయనే పాలేరు టికెట్ కోసం కాంగ్రెస లో దరఖాస్తు చేశారు.

By:  Tupaki Desk   |   27 Aug 2023 11:12 AM GMT
తెలంగాణలో అందరి కళ్లూ ఆ ఒక్క నియోజకవర్గం పైనే
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలే గడువుంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. బీజేపీ జాబితా కసరత్తు సాగిస్తోంది. అయితే, వీటన్నిటి మధ్య రాష్ట్రంలో ఒక నియోజకవర్గంపై అందరి చూపూ నిలిచింది.

పొత్తుల్లోనూ పేరు అధికార బీఆర్ఎస్, వామపక్షాల మధ్య పొత్తు ఉంటుందా? కాంగ్రెస్ లో షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ విలీనం అవుతుందా? వామపక్ష రాష్ట్ర నేత పోటీకి దిగుతారా? ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ అక్కడినుంచి బరిలో దిగుతారా? బీఆర్ఎస్ కు బైబై చెప్పనున్న మాజీ మంత్రి కూడా ఇక్కడే నిలుస్తారా? ఈ పరిణామాలన్నీ ఒక్క నియోజకవర్గంపైనే ప్రభావం చూపుతున్నాయి. అలా దాని పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

షర్మిల, పొంగులేటి, తుమ్మల బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం మార్మోగినంతగా మరే నియోజకవర్గం పేరూ వినిపించదేమో? సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణలో హడావుడి చేసిన వైఎస్ షర్మిల తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ఏడాది కిందటే ప్రకటించారు. అయితే ఇప్పుడామె కాంగ్రెస్ లో విలీనం అనే డైలమాలో ఉన్నారు. అదే జరిగితే ఏపీకి వెళ్తారా? పాలేరు నుంచి బరిలో దిగుతారా? అనేది చూడాలి.

ఇక బీఆర్ఎస్ నుంచి రెండు నెలల కిందట కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్నమొన్నటి వరకు షర్మిల పార్టీ విలీనం ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించారనే కథనాలు వచ్చాయి. షర్మిలను పాలేరు నుంచి పోటీ చేయించే ప్రయత్నాల్లోనూ ఉన్నట్లుగా చెప్పుకొన్నారు.

అయితే, తాజాగా ఆయనే పాలేరు టికెట్ కోసం కాంగ్రెస లో దరఖాస్తు చేశారు. విచిత్రం ఏమంటే ఈ నియోజకవర్గం నుంచి పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.

మాజీ మంత్రి పట్టు..వర్గ విభేదాలతో 2018లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆ పార్టీ టికెట్ దక్కలేదు. ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కూడా చెబుతున్నారు. అదే జరిగితే పాలేరు తమ్ముల మొదటి చాయిస్ అవుతుంది.

ఇక ఇటీవల వరకు వామపక్షాలు అధికార బీఆర్ ఎస్ తో పొత్తుకు ప్రయత్నించి భంగపడ్డాయి. అందులోనూ ముఖ్యంగా సీపీఎం ఒకప్పడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పాలేరు. ఇక్కడినుంచి గతంలో ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పొత్తులో సీటు దక్కితే ఆయనే బరిలో దిగేవారు. కానీ బీఆర్ఎస్ షాక్ ఇవ్వడంతో సొంతంగా బరిలో దిగడం ఖాయం. అలా అన్ని పార్టీలకూ పాలేరు ఓ పాయింట్ అయింది.