తెలంగాణా తీర్పు : బస్సులు కిటకిట... పల్లెలు కళకళ....!
మొత్తం మీద తెలంగాణా ఎన్నికలలో ఎంత మేర పోలింగ్ అన్నది కూడా ఇంపార్టెంట్ ఇష్యూగా ఉండబోతోంది
By: Tupaki Desk | 29 Nov 2023 1:44 PM GMTతెలంగాణాలో పోలింగ్ కి సర్వం సిద్ధం అయింది. ఈసారి పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుందని, గత రికార్డుని సైతం బద్ధలు కొడుతుంది అని భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో పట్నాలు నగరాల నుంచి పెద్ద ఎత్తున సొంతూళ్ళకు అంతా పయనం అయ్యారు.
ఓటు ఎక్కడ ఉందో అక్కడికి ఓటరు చేరుకుంటున్న నేపధ్యం కనిపిస్తోంది. దాంతో ఓటేయడానికి సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికులతో హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ జూబ్లీ బస్టాండ్ వంటికి కిక్కిరిసిపోయాయి. అంతే కాదు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతున్న బస్సులు ఎన్నికల పండుగ ఏంటి అన్నది కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి.
ప్రతీ బస్సు నిండు గర్భిణీని తలపిస్తోంది. సీట్లు అన్నీ ఫుల్ అయిపోతున్నా నిలుచుకుని మరీ జనం సొంత ఊళ్ళకు వెళ్తున్నారు అంటే ఓట్ల పండుగ మీద మమకారం ఎంత అన్నది అర్ధం చేసుకోవాలి. అయితే రద్దీకి తగిన బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు
ఇదిలా ఉంటే విద్యా సంస్థలకు సైతం గురువారం సెలవు ప్రకటించడంతో ఓటెయ్యడానికి ఇంటి బాట పట్టిన విద్యార్థులతో కూడా సందోహం ఒక్క లెక్కన కనిపిస్తోంది. అంతే కాదు ఏపీలో పనిచేస్తూ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు ఈ నెల 30ని సెలవు దినంగా ప్రకటించారు.
అయితే తమ సెలవు దరఖాస్తు తో ఓటరు కార్డు జత చేయాలని అధికారులు సూచించారు. ఇంతలా ఎన్నికల కోసం జనం అంతా పరితపిస్తూంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రూపంలో వరుణుడు ఏమి చేస్తాడు అన్న భయం కూడా ఉంది.
ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా బలపడింది. ఇది బంగాళాఖాతంలో వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది అంటున్నారు. దాంతో తెలంగాణాకు వాన సూచన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.
అల్పపీడన ప్రభావం ఉండే జిల్లాలలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ వంటివి ఉన్నాయని అంటున్నారు. దాంతో వరుణుడు అడ్డంకి కనుక పెట్టకపోతేనే ఓట్ల పండుగ దిగ్విజయంగా సాగుతుంది అని అంటున్నారు.
ఇక ఎన్నికలలో ఓటు హక్కు పూర్తిగా వినియోగించుకోవాలని ఓటు వజ్రాయుధం అని స్వచ్చంద సంస్థలతో పాటు ప్రజా చైతన్య సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దాంతో హోరా హోరీ పోరు సాగడం ప్రధానంగా మూడు పార్టీలు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడంతో ఈసారి పోలింగ్ శాతం కొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు.
మొత్తం మీద తెలంగాణా ఎన్నికలలో ఎంత మేర పోలింగ్ అన్నది కూడా ఇంపార్టెంట్ ఇష్యూగా ఉండబోతోంది. ఈ పోలింగ్ శాతమే మార్పుకు కొత్త తీర్పుకు కూడా సంకేతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.