ఎన్నికల వేళలో స్పెషల్ ఫోన్ ట్యాపింగ్ డ్రైవ్!
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా ట్యాపింగ్ జోరు ఒక రేంజ్ లో ఉన్నట్లుగా గుర్తించారు
By: Tupaki Desk | 19 May 2024 5:34 AM GMTఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ అంశం కాస్త మరుగున పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ.. పార్టీల ప్రాధాన్యతలతో పాటు మీడియా ప్రయారిటీల విషయం వేరుగా ఉండటంతో.. ఆ అంశంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది లేదు. కీలకమైన పోలింగ్ దశ ముగిసిన నేపథ్యంలో.. ట్యాపింగ్ విచారణపై మళ్లీ మీడియా ఫోకస్ పెట్టింది. దీంతో.. మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి అంశాలే బయటకు వచ్చాయి.
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా ట్యాపింగ్ జోరు ఒక రేంజ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. గత ఏడాది ఆగస్టు నుంచి నవంబరు చివరి వారం వరకు రోజుకు పది నెంబర్లు చొప్పున ట్యాపింగ్ చేసినట్లుగా తేల్చారు. నాలుగు నెలల వ్యవధిలో దాదాపు 1300 మందికి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా విచారణ అధికారుల వద్ద సమాచారం ఉంది. ఎన్నికలు ముగిసినంతనే ట్యాపింగ్ ఆగినట్లుగా గుర్తించారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల కదలికలపై నిఘా పెట్టటంతో పాటు.. వారి అనుచరుల కార్యకలాపాల్ని పసిగట్టటం.. వారికి ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించటం.. బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చటం లాంటి అంశాల మీద ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు.
ముఖ్యంగా ఎన్నికల వేళ బీఆర్ఎస్ మీద పోటీ చేసిన ప్రత్యర్థి పార్టీలను బలహీనపర్చటం.. వారి సొమ్ముల్ని జప్తు చేయటం మీదనే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు నాలుగు నెలలు ముందు 1300 ఫోన్లను ట్యాపింగ్ చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాల మీదా.. పోలీసులు ఇప్పుడు ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. ట్యాప్ చేసిన ఫోన్ నెంబర్ల లెక్క తీసి.. వారిని సంప్రదించటం లాంటి బ్యాక్ గ్రౌండ్ వర్కు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చట్టవిరుద్దంగా ఫోన్ ట్యాప్ చేసిన అంశాలకు సంబంధించిన ఆధారాలను సేకరించటం మీదనే ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన సంచలన పరిణామాలు మరిన్ని చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.