Begin typing your search above and press return to search.

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్ద‌రు సీఐలు.. అరెస్టు!

వారు కూడా అప్ప‌టి డీఎస్పీ ప్ర‌ణీత్ రావుకు స‌హ‌క‌రించిన‌ట్టు గుర్తించారు.

By:  Tupaki Desk   |   20 March 2024 2:30 AM GMT
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్ద‌రు సీఐలు.. అరెస్టు!
X

తెలంగాణ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో మ‌రో సంచ‌ల‌నం వెలుగు చూసింది. ఈ కేసులో ఇప్ప‌టికే అరెస్టు చేసిన ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్ర‌ణీత్ రావును విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న నోటి నుంచి అనేక నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఇద్ద‌రు పోలీసు సీఐల పాత్ర కూడా ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో ఈ కేసును విచారిస్తున్న పంజాగుట్ట పోలీసులు వారిని అరెస్టు చేసిన‌ట్టు స‌మాచారం. వారు కూడా అప్ప‌టి డీఎస్పీ ప్ర‌ణీత్ రావుకు స‌హ‌క‌రించిన‌ట్టు గుర్తించారు.

కోర్టు అనుమ‌తితో ప్ర‌ణీత్ రావును పోలీసులు ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో నే ఆయ‌న‌ను విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడో రోజు ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం సేకరించారు. ఎస్‌ఐబీలో ప్ర‌ణీత్‌రావుతో పాటు పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌ స్థాయి(సీఐ) నుంచి కానిస్టేబుల్‌ స్థాయి అధికారులను విచారించి, వాంగ్మూలం నమోదు చేశారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా ప్రణీత్‌ను ప్రశ్నిస్తున్నారు. డిసెంబరు 4న ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఎవరెవరు సహకరించిందీ ఈ క్ర‌మంలో ప్రణీత్‌రావు వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.

వీరిలో వ‌రంగ‌ల్ సీఐలు ఇద్ద‌రు ఉన్నార‌ని ఆయ‌న చెప్ప‌డంతో హుటాహుటిన వారిని అరెస్టు చేశారు. ఇక‌, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో ఎవరి ఆదేశాల మేరకు ఆధారాలు, ఐఎంఈఐ నంబర్లు, సీడీఆర్‌, ఐపీ అడ్రస్‌ల డేటాను సేకరించారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ధ్వంసం చేసి కొత్తవి ఎందుకు అమర్చాల్సి వచ్చిందని ప్రశ్నించగా.. ప్రణీత్‌ మౌనంగా ఉన్నట్టు సమాచారం. మరో వైపు వికారాబాద్‌ అడవుల్లో పడేసిన హార్డ్‌ డిస్క్‌ల ముక్క‌ల‌ను సేకరించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో అట‌వీ శాఖ అనుమ‌తి తీసుకుని ప్రణీత్ రావును స్వయంగా అక్క‌డ‌కు తీసుకెళ్లి పడేసిన ప్రాంతంలో వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు.

ఏం జ‌రిగింది?

గ‌త బీఆర్ ఎస్ హయాంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, కొంద‌రు మీడియా ప్ర‌తినిధుల ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు వెలుగు చూసింది. అది కూడా.. డీఎస్పీగా ఉన్న ప్ర‌ణీత్ రావు కొన్ని రోజుల కింద‌ట ఆక‌స్మికంగా స్టేష‌న్ కు వ‌చ్చి.. హార్డ్ డిస్కుల‌ను ధ్వంసం చేయ‌డంతో ఈ విష‌యం వెలుగు చూసింది. అప్ప‌టి విప‌క్ష నేత‌ల ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు గుర్తించారు.