ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియాకు హైకోర్టు కీలక సూచన
పెను సంచనలంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది
By: Tupaki Desk | 11 July 2024 6:30 AM GMTపెను సంచనలంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో భాగంగా తెలంగాణ హైకోర్టు మీడియాకు కీలక సూచన చేసింది. ట్యాపింగ్ కేసు వారతల ప్రచురణ సమయంలోనూ.. ఆ వార్తల్ని ప్రసారం చేసే సమయంలోనూ సంయమనం పాటించాలని పేర్కొంది. ఈ సందర్భంగా కీలక అంశాల్నిప్రస్తావించింది. ట్యాపింగ్ బాధితులకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు జడ్జిలు.. వారి కుటుంబ సభ్యుల పేర్లు.. ఫోన్ నెంబర్లను కూడా ప్రచురించిన వైనాన్ని ప్రస్తావించింది.
ఇలా వివరాల్ని బయటకు వెల్లడించటం సరికాదని పేర్కొన్న న్యాయస్థానం.. ‘‘వార్తల కవరేజీ విషయంలో మీడియా సంయమనం పాటిస్తుందని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొంది. ట్యాపింగ్ కేసులో రాజకీయ ప్రత్యర్థులు.. ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ లను ట్యాప్ చేశారంటూ పత్రికల్లో కథనాలు రావటం పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా కథనాల్నిసుమోటోగా తీసుకున్న హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ట్యాపింగ్ కేసు వార్తల కవరేజీలో మీడియా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం.. సంయమనంతో వ్యవహరించటంతో పాటు వ్యక్తిగత గోప్యత అంశాల్ని విస్మరించరాదని చెప్పింది. ఈ కేసు విచారణను జులై 23కు వాయిదా వేసింది. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అధికారులకు మరోసారి షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు సమర్పిస్తున్న పత్రాల్లోని తప్పుల్ని న్యాయస్థానం గుర్తిస్తూ.. వాటిని వెనక్కి పంపటం తెలిసిందే.
ఇలాంటి వేళలో అయినా.. కాసింత జాగ్రత్తలు తీసుకొని తప్పులు దొర్లకుండా పత్రాల్ని తయారుచేయాల్సిన పోలీసులు అదే పనిగా తప్పులు చేయటం గమనార్హం. తాజాగా నిందితుల్ని విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను సమర్పించకుండా అభియోగపత్రాల్ని కోర్టులో దాఖలు చేసిన వైనంపై నాంపల్లి కోర్టు రియాక్టు అయ్యింది. అవసరమైన పత్రాల్ని జత పర్చని వైనాన్ని ఎత్తి చూపిస్తూ.. సంబంధిత వివరాల్ని కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. గతంలోనూ ఛార్జిషీట్ లోనూ.. అభియోగపత్రాల్లోనూ సమాచారం సరిగా లేదంటూ తిప్పి పంపటం తెలిసిందే. ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తిన్న తర్వాత కూడా పోలీసులు తమ తీరు మార్చుకోలేదన్న విమర్శ వినిపిస్తోంది. తాజా ఎదురుదెబ్బతో అయినా మారతారా? ఇలాంటి తీరునే కంటిన్యూ చేస్తారా? అన్నది చూడాలి.