Begin typing your search above and press return to search.

కీలక మంత్రులకు భారీ షాక్...తెలంగాణాలో ఏం జరగనుంది...?

ఈసారి తెలంగాణా ఎన్నికల్లో బీయారెస్ మంత్రులు చాలా మందికి ఎదురు గాలి వీస్తోందా అంటే వివిధ సర్వే నివేదికలు అవును అనే అంటున్నాయి.

By:  Tupaki Desk   |   14 Oct 2023 8:00 PM IST
కీలక మంత్రులకు భారీ షాక్...తెలంగాణాలో ఏం జరగనుంది...?
X

ఎన్నికలు అంటే ప్రజల చేతికి అధికారం. అయిదేళ్ళకు ఒక మారు ప్రజలే రాజు. ఓటు వేసే రోజు వరకూ ఓటరన్నే మహారాజు. ఎంతటి పెదలైనా మరెంతటి మహానుభావులైనా ఓటు కోసం వారి వద్దకే వస్తారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో మంత్రులు అయినా మహారాజ వైభోగం అనుభవించి ప్రజల వద్దకు వస్తే వారు ఏమి ఆలోచిస్తారు అన్నది కీలకమైన ప్రశ్న.

తమ గురించి అయిదేళ్ళూ పట్టించుకున్నారా అన్నదే ప్రజలు కొలమానంగా తీసుకుంటారు. ఈసారి తెలంగాణా ఎన్నికల్లో బీయారెస్ మంత్రులు చాలా మందికి ఎదురు గాలి వీస్తోందా అంటే వివిధ సర్వే నివేదికలు అవును అనే అంటున్నాయి. కేసీయార్ మంత్రివర్గంలో ఉన్న వారిలో సీనియర్లు ఉన్నారు, ఇతర పార్టీల నుంచి వచ్చి అందలం ఎక్కిన వారు ఉన్నారు.

వీరంతా తాజాగా ప్రజల తీర్పు కోరబోతున్నారు. మరి ప్రజల కరుణా కటాక్షం ఎవరి మీద ఉంటాయా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. అన్ని పార్టీలు వేటికవే సొంత సర్వేలు చేయించుకుంటున్నాయి. అలాగే జనరల్ సర్వేలు వస్తున్నాయి. ఈ సర్వేలు అన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది అధికార పార్టీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది అని. అది కూడా పీక్స్ లోనే ఉంది అని అంటున్నారు.

ఆ వ్యతిరేకత నుంచి ఎదురీత నుంచి గట్టెక్కడం అన్నది ఎలా అంటే కేసీయార్ రాజకీయ చాణక్యం మీదనే ఆధారపడి ఉంది అని అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే చాలా మంది మంత్రుల జాతకాలను మాత్రం మార్చేసేందుకు ప్రజలు తయారుగా ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణాకు గుండె కాయ లాంటి భాగ్యనగరం పరిధిలో ఉన్న చాలా మంది బీయారెస్ ఎమ్మెల్యేలు మంత్రులకు నూటొకటి కొడుతోంది అని అంటున్నారు. ఇక్కడ సెటిలర్స్ చాలా మంది ఉన్నారు.

అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ పాటి ఉందో మూడేళ్ళ క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలియచెప్పాలి. నాటికీ నేటికీ ఆ వ్యతిరేకత పెరుగుతోంది అనే అంటున్నారు. ఇక హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రుల విషయం తీసుకుంటే వ్యతిరేకత ఎక్కువగా ఉందని అంటున్నారు.

ఇదే విధంగా తెలంగాణాను నాలుగు భాగాలుగా విభజిస్తే తూర్పు, పడమరలలో కొంత అనుకూలత ఉన్నా ప్రత్యేకించి ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలలో మాత్రం అధికార పార్టీకి అంత సానుకూలత లేదని అంటున్నారు. ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులకు గ్రౌండ్ లెవెల్ లో ఏ మాత్రం పరిస్థితులు బాగులేవని అంటున్నారు.

మంత్రులు చాలా మంది స్వీయ ప్రయోజనం చేసుకుంటూ భూ దందాలలో వేలూ కాలూ పెట్టి పుణ్య కాలం హాయిగా గడిపేశారని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా అధినాయకత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు దాదాపుగా తామున్న ప్రాంతాలకు రారాజులుగా మారిపోయారని దాంతో వారి దూకుడు ఎక్కువ అయింది అని అంటున్నారు. ఇపుడు సరిగ్గా ఎన్నికల వేళ ఇలాంటి వారు అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిజానికి చూస్తే బీయారెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. కేసీయార్ మీద మంచి అభిప్రాయం ఉంది కానీ మంత్రులు కొందరి మీద అంతకంటే ఎక్కువగా ప్రజాగ్రహం ఉంది అంటున్నారు.అలాగే ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగాలేదని జనాలు అసంతృప్తిలో ఉన్నారు. దాంతో వీరంతా ఎన్నికల గండం ఎలా గట్టెక్కుతారు అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. కేసీయార్ ఎన్నికల ప్రచారానికి వచ్చి టోటల్ సీన్ చేంజి చేస్తారా అన్నది కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.