Begin typing your search above and press return to search.

గడీల బద్దలు నినాదం ఒకరిది.. ఆచరణ మరొకరిది

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వారం రోజుల కిందటి వరకు భిన్నంగా ఉండేది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యన త్రిముఖ పోరు తప్పదా? అనే పరిస్థితి నెలకొంది.

By:  Tupaki Desk   |   15 Dec 2023 12:30 AM GMT
గడీల బద్దలు నినాదం ఒకరిది.. ఆచరణ మరొకరిది
X

తెలంగాణలో ఒకనాటి కాలం నిజాంల పాలన.. వారి కింద జాగీర్దార్లు, జమీందార్లు,దేశ్ ముఖ్ లు ఉండేవారు.. తమ ప్రాంతానికి నిజాం ప్రతినిధులు వీరు. "దొర" అంటూ సాధారణ ప్రజల వీరిని సంబోధించాల్సి వచ్చేది. ఇక ఈ పెత్తందార్ల ఆగడాలకు అంతుపొంతు ఉండేది కాదని చెబుతారు. అయితే, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం, భారత ప్రభుత్వ సైనిక చర్య అనంతరం నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తమైంది. నాటి పెత్తందారీ ఆనవాళ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. కానీ, నిజాం కాలంలో ఆగడాలు సాగించిన కొన్ని వర్గాలకు చెందినవారు రాజకీయాల్లోకీ వచ్చారు. వారు ప్రజా సేవలో ఎంత నిమగ్నమైనా రాజకీయంగా విమర్శించే క్రమంలో "దొర" అని వారి నివాసాలను "గడీ" అని ప్రత్యర్థులు సంబోధించడం పరిపాటిగా మారింది.

నినదించిన గొంతు వెనక్కుబోయింది

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వారం రోజుల కిందటి వరకు భిన్నంగా ఉండేది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యన త్రిముఖ పోరు తప్పదా? అనే పరిస్థితి నెలకొంది. కానీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తప్పించేసరికి ఆ పార్టీ రేసులో నుంచి పక్కకుపోయింది. ఇక్కడ సంజయ్ ప్రస్తావన ఎందుకంటే.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాలనకు అంతం పలుకుతాం అని చెప్పే క్రమంలో.. ఆయన నివాసాన్ని గడీ అని సంబోధించే ఉద్దేశంలో తరచూ "దొరల గడీలు బద్దలు కొడతాం" అని వ్యాఖ్యానించేవారు. అలా "దొరల గడీల బద్దలు" అనే విమర్శకు సంజయ్ హక్కుదారు అయ్యారు. ఆయనను తెలంగాణ రాజకీయాల నుంచి తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు. దీంతో దొరల గడీల బద్దలు పదం వెనక్కుపోయింది.

బద్దలుకొట్దింది రేవంత్

ఏ ముహూర్తాన బీజేపీ వెనక్కుపోయిందో.. తెలంగాణ తెరపైకి కాంగ్రెస్ దూసుకొచ్చింది. అధికారాన్నీ కైవసం చేసుకుంది. అజేయుడిగా భావిస్తున్న కేసీఆర్ ను ఓడించిన రేవంత్ రెడ్డి సారథ్యానికి గొప్ప మన్నన దక్కింది. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ఆపై తనదైన శైలిలో పాలనలో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ అధికారిక నివాసంగా వినియోగించిన ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్ అని మార్చారు. దీనికిముందే ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను తొలగింపజేశారు. అనంతరం ప్రజా దర్బార్ (ప్రజా వాణి) చేపట్టారు. తాజాగా ప్రజా భవన్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికార నివాసంగా కేటాయించారు. అలా.. గడీల బద్దలు నినాదం ఒకరిది.. ఆచరణ మరొకరిదిగా మారింది.

కొసమెరుపు: గడీల బద్దలు అంటూ తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని అనూహ్యంగా వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి కూడా ఓడిపోయారు. కానీ, అదే ఎంపీగా ఉన్న రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.