రాజకీయ ఎత్తు 'గడల'
ఏ సర్కారుకు ఆ సర్కారు వారి పాట తెలంగాణలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కొందరు అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.
By: Tupaki Desk | 5 Feb 2024 12:30 AM GMTఆయన రాష్ట్ర స్థాయి అధికారి.. కానీ గత ప్రభుత్వంలో అధికార పార్టీకి బాహాటంగానే మద్దతు పలికారు. మహమ్మారి సమయంలో ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత వ్యవహార శైలితో వివాదాస్పదం అయ్యారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి కూడా పాలకులకు అత్యంత విధేయంగా ఉండడంపై విమర్శలు వచ్చాయి. ఇక తన అంతిమ లక్ష్యం ఎన్నికల్లో పోటీకి టికెట్ తెచ్చుకోవడమేనని ప్రకటించారు. అయితే, అది వేరేవారికి దక్కింది. మరోవైపు ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఆయన పదవీ మారింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థతుల్లో తెలివైన ఎత్తుగడ వేశారు.
ఏ సర్కారుకు ఆ సర్కారు వారి పాట తెలంగాణలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కొందరు అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. మరీ ముఖ్యంగా కొందరు రాష్ట్ర స్థాయి అధికారులు బీఆర్ఎస్ సర్కారుకు అత్యంత విధేయంగా వ్యవహరించారు. ఇలాంటివారంతా ఇప్పుడు ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారు. ఇక కొందరు అధికారులు పీకల్లోతు ఆరోపణల్లో కూరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గనుక గుడ్లురిమితే వీరంతా కటకటాలపాలవ్వాల్సిందే. అందుకని కొత్త సారును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇంతలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇదే అవకాశంగా భావించిన ఓ రాష్ట్ర స్థాయి అధికారి ఏకంగా రెండు లోక్ సభ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అప్పుడు అసెంబ్లీ.. ఇప్పుడు లోక్ సభ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేసిన ఆయన.. ఇప్పుడు ఏకంగా లోక్ సభ సీటుకే గురిపెట్టారు. అయితే, ప్రభుత్వం మారాక ఆయనను వేరే పోస్టుకు బదిలీ చేశారు. అంతేగాక, అవినీతి ఆరోపణలపై విచారణకు ఫైలు కదులుతోంది. దీంతో ఆ అధికారి అధికార పార్టీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అందుకే నేను మీ వాడిని అనే సంకేతాలు ఇచ్చేలా లోక్ సభ టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఎత్తుగడ వేశారు.
కొసమెరుపు: అసెంబ్లీ ఎన్నికల టికెట్ కోసం ఓ నియోజకవర్గంలో ఈ అధికారి ఏకంగా రూ.2 కోట్ల దాకా ఖర్చుపెట్టారు. కానీ, సిటింగ్ కే సీటిచ్చిన బీఆర్ఎస్.. ఈయనకు మొండిచేయి చూపింది. ఆ అసహనంతో కొన్నాళ్లు బయటకు రాలేదు. మళ్లీ ఇప్పుడు ఏకంగా పార్టీ మార్చి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు పెట్టారు.