తెలంగాణ రాజకీయాలకు ‘‘శుభ శ్రావణం’’..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు.
By: Tupaki Desk | 4 Aug 2024 1:30 PM GMTఆషాఢ మాసం వెళ్లిపోయి మంచి ముహూర్తాలకు నెలవైన శ్రావణ మాసం తెలంగాణ రాజకీయాలకు శుభ శ్రావణంగా మారనుంది.. మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు సంతోషం తేనుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలైనా పూర్తి స్థాయిలో పదవుల పందేరం జరగలేదు. కాంగ్రెస్ లో సీఎం స్థాయికి సమానమైన టీపీసీసీ అధ్యక్షుడి నియామకం చివరి వరకు వచ్చి పెండింగ్ లో పడింది. కీలక నేతలందరూ ఢిల్లీకి చేరి.. నేడో, రోపో నియామక ప్రకటన వెలువడుతుంది అనగా అనూహ్యంగా నిలిపివేశారు. శ్రావణ మాసంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామక ప్రకటన ఉంటుందని భావించవచ్చు.
మంత్రులెవరో?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు. అందులో కీలకమైన హైదరాబాద్ కూడా ఉంది. ఇక ఆరు ఖాళీలకు కాను నలుగురిని ఈ శ్రావణ మాసంలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. సీఎం రేవంత్ అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చాక మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. బహుశా టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవిని, సామాజిక వర్గాల వారీ సమతుల్యతను చూసుకుంటూ ఈ నియామకాలను చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న మంత్రుల్లో ఎవరినైనా టీపీసీసీ చీఫ్ గా పంపే ఆలోచన చేస్తే.. ఆ మేరకు ఏర్పడే ఖాళీని భర్తీ చేయడమూ కీలకమే. ఆ తర్వాత మిగిలిపోయిన నామినేటెడ్ పదవులకూ ఎంపికలు చేపడతారేమో చూడాలి. మరోవైపు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎవరనేది నియామకం జరగలేదు. నలుగురు విప్ లను ప్రకటించినా.. మూడుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా చీఫ్ విప్ ఎవరో అనేది స్పష్టం కాలేదు. శ్రావణ మాసంలో చీఫ్ విప్ నూ నియమిస్తారేమో చూడాలి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందా?
సరిగ్గా ఏడాది కిందట.. తెలంగాణ అధ్యక్షుడిని మార్చింది బీజేపీ. దీంతో ఆ పార్టీ విజయావకాశాలు దెబ్బతిన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైంది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో 8 స్థానాలు నెగ్గి పట్టు చాటింది. ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రంలో పూర్తిస్థాయి మంత్రి అయ్యారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సహాయ మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని చెబుతున్నారు. కిషన్ రెడ్డి, సంజయ్ కాకుండా కొత్త నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగిస్తారేమో చూడాలి. అయితే, పలు రాష్ట్రాల్లో అధ్యక్షల మార్పు, ఎన్నికలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక దీనితో ముడిపడి ఉంది.
అసెంబ్లీలో అధికారం కోల్పోయి, లోక్ సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయిన బీఆర్ఎస్ లో మాత్రం శ్రావణ శుభాలు కనిపించడం లేదు. బహుశా ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి ఐదు నెలలుగా జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభిస్తే వారికి అదే శుభకరం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.