గంభీరం-ధైర్యం-దాసోహం... 24 ఫ్రేమ్స్‌లో తెలంగాణ పాలిటిక్స్
24 ఫ్రేమ్స్.. అంటే.. 24 కళలు. సహజంగా దీనిని సినిమాలు, రంగస్థలానికి సంబంధించిన వ్యవహారాల్లోనే ఎక్కువగా వాడతాం.
By: Tupaki Desk | 6 Nov 2023 6:27 AM GMT24 ఫ్రేమ్స్.. అంటే.. 24 కళలు. సహజంగా దీనిని సినిమాలు, రంగస్థలానికి సంబంధించిన వ్యవహారాల్లోనే ఎక్కువగా వాడతాం. అలాంటిది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కువగా ఈ 24 ఫ్రేమ్స్ అనే మాట వినిపిస్తోంది. 24 కళల్లో కీలకమైంది.. గంభీరం-ధైర్యం-అభినయం-లావణ్యం-మందహాసం.. చివరిది దాసోహం! ఇవన్నీ.. ఇప్పుడు తెలంగాణలోని అన్ని పార్టీల నాయకుల మధ్య కనిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ ఎస్ నేతల మధ్య 24 కళలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆ ర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లుగా బీఆర్ ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన సమయంలో కేసీఆర్.. చాలా గంభీరంగా కనిపించారు. ``మనదే అధికారం. మూడో సారి కూడా మనదే ప్రభుత్వం. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం`` అంటూ.. చాలా గంభీరంగా ఉపన్యాసాలు దంచికొట్టారు.
ఇక, కేటీఆర్, హరిష్ రావులు కూడా.. ఇదే తరహాలో ప్రసంగాలు ఇచ్చారు. ``ఎవడ్రామనల్ని ఆపేది`` అంటూ.. నాయకులు సెలవిచ్చారు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ.. జంపింగుల పర్వం సాగుతున్న కొద్దీ.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు వంటివి గమనించిన తర్వాత.. గంభీరం కాస్తా.. ధైర్యంగా మారింది. ఇక, అప్పటి నుంచి ``మన రాష్ట్రంలో మనదే పాలన సాగించుకోవాలి. మనపై పెత్తదారులు అవసరమా!`` అంటూ కేసీఆర్ గళం సవరించుకున్నారు.
ఇక, ఇదే కోవలోమంత్రులు కేటీఆర్, హరీష్‌రావు కూడా.. తమ ప్రసంగాల్లో గంభీరాన్ని పక్కన పెట్టి.. తమకు తామే ధైర్యం చెప్పుకొనే రీతిలో ప్రసంగాలు సాగించారు. ఇక, నామినేషన్ల ఘట్టం వచ్చేసింది. సర్వేలు.. అధికార పార్టీకి బొటాబొటి లేదా.. మేజిక్ ఫిగర్‌కు అటు ఇటుగా ఫలితాలు వెల్లడించడం ప్రారంభించాయి. ఇక, అప్పటి నుంచి అధికార పార్టీలో 24 ఫ్రేమ్స్‌లోని చిట్టచివరిదైన దాసోహం తెరమీదికి వచ్చింది. ప్రజల్లో సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు.. ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
కేసీఆర్ చేసిన త్యాగాలు.. ఉద్యమాలను తెరమీదికి తెచ్చారు. ఇప్పుడు అభివృద్ధి బాటలోకి ఎక్కిన తెలంగాణను ఢిల్లీ, గుజరాత్ దొరల చేతుల్లో పెడతమా! వివేచనతో ఓటేయాలి. ప్రజలు ఆలోచించాలి. ఎవరు తెలంగాణ కోసం పనిచేస్తున్నారో గుర్తించాలి. అంటూ.. బేల ప్రకటనలు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ చేస్తున్న ఈ విన్యాసాలు ఆసక్తిగా మారాయి. మరి ప్రజలుఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.