మంత్రులు కానట్లే.. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ ఏం చెబుతున్నారు?
కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 29 Jun 2024 5:30 PM GMTతెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి క్యూ కట్టారు. ఒక్కొక్కరికి కారు దిగి వెళ్లిపోవడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిగులు చెందుతున్నారు. ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలతో స్వయంగా సమావేశం నిర్వహించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందనే చెప్పాలి. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చెప్పారు. ఎవరైనా సరే సొంత ప్రయోజనం ఆశించే మార్టీ మారతారనడంలో సందేహం లేదు. కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ బీ ఫామ్‌పై పోటీ చేసిన వాళ్లనే కేబినెట్‌లోకి తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేశారు. మరి మంత్రి పదవులు కాకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం చెప్పి రేవంత్ తమ పార్టీలోకి తీసుకొస్తున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు దారుణ పరాభవం మిగిలింది. రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. మునిగిపోయే పడవ లాంటి ఆ పార్టీలో ఉండలేక బీఆర్ఎస్ నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వీళ్లకు రేవంత్ చేయి అందిస్తున్నారు.
బీఆర్ఎస్‌లో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదనే విషయాన్ని ఆ ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా రేవంత్ చెబుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరితే ఇప్పుడు మంత్రి పదవి దక్కకపోయినా భవిష్యత్‌లో కచ్చితంగా ప్రాధాన్యం కల్పిస్తామని రేవంత్ హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఓడిన పార్టీలో ఉండటం కంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కొనసాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అధికారంతో ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. రేవంత్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇలాంటి మాటలు చెప్పే కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.