Begin typing your search above and press return to search.

కేసీఆర్ భయపడుతున్నారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడో సారి విజయం సాధించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 3:08 PM GMT
కేసీఆర్ భయపడుతున్నారా?
X

ఎవరి ఊహకు అందకుండా.. అంచనాలను దాటి వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తన సిట్టింగ్ స్థానం గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతానని ఆయన పేర్కొన్నారు. దీంతో ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని విపక్షాల విమర్శిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందనే కేసీఆర్కు ముందే తెలిసిందని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. అయితే కేసీఆర్ నిజంగానే భయపడ్డారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడో సారి విజయం సాధించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. దీంతో ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి ఆయన.. ఈ సారి గజ్వేల్ నుంచి కాకుండా కామారెడ్డి, పెద్దపల్లి, మేడ్చల్లో ఒక చోటు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కామారెడ్డి నుంచి కచ్చితంగా బరిలో దిగుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

చివరకు కామారెడ్డితో పాటు గజ్వేల్లోనూ కేసీఆర్ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో పార్టీని పటిష్ఠం చేయాలనే కేసీఆర్ ఆలోచన దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సర్వేల ప్రకారం ఈ సారి ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ప్రతికూల పవనాలు వీస్తాయని కేసీఆర్కు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో స్వయంగా కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసి ఉమ్మడి నిజామబాద్లో పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చడంతో పాటు అక్కడ అభ్యర్థులను మరోసారి గెలిపించుకోవాలన్నది ప్లాన్ అని చెబుతున్నారు.

గజ్వేల్లో ఎలాగో కేసీఆర్ గెలుపును ఎవరూ ఆపలేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్లో పోటీ చేసి కేసీఆర్ను ఓడిస్తామని బీజేపీ నుంచి రఘునందన్, ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి సవాలు విసురుతున్నారు. ఏది ఏమైనా.. ఎవరు బరిలో నిలిచినా గజ్వేల్లో మాత్రం కేసీఆర్ను ఓడించలేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.