రోడ్డు కోసం ఒకరు.. డబ్బు కోసం ఇంకొకరు.. తెలంగాణ పోలింగ్ 'సిత్రాలు'
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌కు అవకాశం ఉండడంతో ఓటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 30 Nov 2023 9:12 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడం.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 29 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అందరూ రావాలని.. ఓటేయాలని నాయకుల నుంచి అధికారుల వరకు ప్రజాసంఘాల దాకా పిలుపునిచ్చారు. అయితే.. ఒక్క హైదరాబాద్ ఓటరు తప్ప అందరిలోనూ చైతన్యం కనిపించింది. దాదాపు అన్ని చోట్లా పోలింగ్ ఆశాజనకంగానే సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌కు అవకాశం ఉండడంతో ఓటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు.
అయితే.. ఇక్కడే రెండు చిత్రమైన ఘటనలు వెలుగు చూశాయి. రోడ్డు కోసం.. ఓ గ్రామంలోని ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించి నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో పెంబి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామంలో 226 పోలింగ్ బూత్‌లో పోలింగ్ మధ్యాహ్నం 12 వరకు ప్రారంభం కాలేదు. తమకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చేవరకు ఓటు వేసేది లేదని ఎంగ్లాపూర్ గ్రామస్తులు ఆందోళ చేశారు. పోలింగ్ స్టేషన్‌కు సమీపంలో వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు.. పక్క రోడ్డులో డబ్బులు పంచారని.. తమకు ఎందుకు ఇవ్వలేదని.. తామేం పాపం చేశామని ప్రశ్నిస్తూ.. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు వీరాపురం, గొల్లగూడెం గ్రామాల్లో ఓటర్లు పోలిం గ్ కేంద్రాలకు వెళ్లకుండా నిరసన తెలిపారు. ఓటు వెయ్యబోమని గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు. డబ్బులిస్తేనే ఓటేస్తామని తెగేసి చెప్పారు. దీంతో నాయకులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. చేతులు మాత్రం ముడుచుకోకపోవడం గమనార్హం.