తెలంగాణ ఓట్ల లెక్కింపు లెక్కేంటి? ఎన్ని రౌండ్లకు ఫలితం రానుంది?
By: Tupaki Desk | 3 Dec 2023 2:34 AM GMTఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసి.. ఓట్ల లెక్కింపు ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. ఈ ఎన్నికల ఫలితం కోసం తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేనా.. యావత్ దేశం కూడా ఆసక్తిగా చూస్తున్నది. నిజానికి తెలంగాణ అసెంబ్లీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు (మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్.. మిజోరం) ఎన్నికలు జరిగాయి.
వీటి పోలింగ్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రం కంటే ఎంతో ముందే పూర్తి అయ్యాయి. వీటి ఫలితాలు కూడా ఈ రోజే వెలువడనున్నాయి. ఇక.. తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులోకి వెళితే.. కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు షురూ కానుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ 60. ఏ పార్టీ అయితే అరవై స్థానాల్ని సొంతం చేసుకుంటుందో ఆ పార్టీ అధికారంలోకి రానుంది.
ఇంతకూ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెలువడే అవకాశం ఉందన్న విషయంలోకి వెళితే.. 119 నియోజకవర్గాలకు సంబంధించి 2417రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. అధికారుల అంచనా ప్రకారం మొదటి ఫలితం ఉదయం 10 గంటలకు తేలే వీలుంది. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలాలంటే 26 రౌండ్లకు కానీ తేలదు. అదే సమయంలో భద్రాచలం అసెంబ్లీ ఫలితం 13రౌండ్లకే తేలిపోనుంది. అశ్వరావు పేట 14రౌండ్లు.. చార్మినార్ ఫలితం 15 రౌడ్లు.. సికింద్రాబాద్ 16 రౌండ్లు.. కంటోన్మెంట్ 17 రౌండ్లు.. అంబర్ పేట ఫలితం 18 రౌండ్లకు తేలనుంది. ఓట్ల ఆధారంగా రౌండ్ల సంఖ్య పెరగటం.. తగ్గటం ఉంటుంది.
ఏది ఏమైనా పోటాపోటీగా ఫలితాలు వస్తే మాత్రం అధికారం ఎవరి వైపు మొగ్గుతుందన్న విషయంపై స్పష్టత రావాటానికి మధ్యాహ్నం 1.30 గంటల వరకు టైం తీసుకుంటుందని చెబుతున్నారు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉంటే మాత్రం ఉదయం 11.30 గంటలకు కొంత.. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తిస్థాయిలో అంచనాకు వచ్చేయొచ్చని చెప్పక తప్పదు.