Begin typing your search above and press return to search.

నాటి రవాణా మంత్రి.. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆర్టీసీపై ఏమన్నారంటే?

ఎన్నికల ముంగిట ఇలా..తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పై నాలుగేళ్ల కిందట కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపింది

By:  Tupaki Desk   |   2 Aug 2023 5:16 PM GMT
నాటి రవాణా మంత్రి.. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆర్టీసీపై ఏమన్నారంటే?
X

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఎన్నికలకు నాలుగు నెలల ముంగిట ఇది పెద్ద సంచలనమే. అందులోనూ నిత్యం ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న వేలాది ఉద్యోగులు కావడంతో ఈ నిర్ణయం మరింత ప్రభావం చూపనుంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వంలో విలీనమైనా.. కార్పొరేషన్‌ అలాగే ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. టీఎస్‌ ఆర్టీసీ అలాగే ఉంటుందని.. దానికి ఛైర్మన్‌, ఎండీ కొనసాగుతారని పేర్కొన్నారు. ఇక ఆర్టీసీ విలీనంపై ఇప్పటికే కమిటీ ఏర్పాటైందని.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెడతామని పేర్కొన్నారు.

ప్రగతి రథ చక్రం ప్రభుత్వంలోకి ఆర్టీసీ అంటేనే కష్టాలు.. నష్టాలు అనేది ఒకప్పటి మాట. వేల కోట్ల ఆస్తులున్నా.. ప్రజల్లో ఆదరణ ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎదురవడం అంటే పాలకుల వైఫల్యం. అధికార యంత్రాంగం అసమర్థతే. అయితే, కొన్నాళ్లుగా పరిస్థితి మారుతోంది. ఆర్టీసీని గాడిన పెట్టాలనే లక్ష్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని నిర్ణయించడం గమనార్హం.

అప్పట్లో కేసీఆర్ రవాణా మంత్రి..దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ తరానికి తెలంగాణ ఉద్యమ నిర్మాతగా, ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా కనిపిస్తారు. కానీ 28 ఏళ్ల కిందట ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అదికూడా ఉమ్మడి ఏపీలో రవాణా మంత్రిగా 1995 నుంచి 1999 వరకు నాలుగేళ్లు కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ ఆర్టీసీ ఆయన కనుసన్నల్లోనే నడిచిందన్నమాట.

సమ్మె సమయంలో ఇలా..2019 అక్టోబరు ప్రారంభంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఈ సమ్మె నెల రోజుల పైగా సాగింది. డిమాండ్ల సాధనకు ఆర్టీసీ సిబ్బంది పెద్దఎత్తున ఉద్యమం కూడా చేశారు. ఈ సందర్భంగా కొందరు చనిపోయారు కూడా. అయితే ఇదే సమయంలో ఏపీలో కొత్తగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. సమ్మె సమయంలో దీనిపైనే విలేకరులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించగా.. ఆయన తీవ్రంగా స్పందించారు. "ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అనేది ప్రభుత్వంలో కలపడం అనేది అసంబద్ధమైన, అర్థరహితమైన, అసంభవమైన తెలివి తక్కువ నినాదం. అదో నినాదమాండి..? వందశాతం అసంభవం. ఈ భూగోళం ఉన్నంతవరకు అది జరగదు. అక్కడ (ఏపీలో) ఓ ప్రయోగం జరిగింది. ఓ కమిటీ వేశారు అంతే. మన్ను కూడా జరగలేదు" అంటూ విరుచుకుపడ్డారు.

ఎన్నికల ముంగిట ఇలా..తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పై నాలుగేళ్ల కిందట కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపింది. చివరకు కఠిన చర్యలకూ వెనుకాడలేదు. చివరకు ఉద్యోగులే దిగొచ్చి సమ్మె విరమించారు. కాగా, అప్పట్లోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం అనే ప్రతిపాదనను నిర్ద్వందంగా ఖండించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఎన్నికల ముంగిట అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను అత్యంత సంతోష పెట్టడమే కాక ఓవిధంగా ఆశ్చర్యపరిచిందని కూడా చెప్పొచ్చు.