Begin typing your search above and press return to search.

రేవంత్ తర్వాత ఎవరు ?

ఈ నేపథ్యంలో రేవంత్ తర్వాత పీసీసీ పగ్గాలు ఎవరికి ? అన్న విషయంలో ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 6:57 AM GMT
రేవంత్ తర్వాత ఎవరు ?
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలల కాలం పూర్తయింది. శాసనసభ ఎన్నికల్లో గెలిచి పాలనపగ్గాలు చేపట్టి కుదురుకుంటుండగా లోక్ సభ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం అవి కూడా ముగిశాయి. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఈ నెల 27తో పీసీసీ చీఫ్‌గా ఆయన మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రేవంత్ తర్వాత పీసీసీ పగ్గాలు ఎవరికి ? అన్న విషయంలో ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

కొత్త పీసీసీ నియామకం, క్యాబినెట్ విస్తరణ అంశాలపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో తన అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తుంది. పీసీసీ నియామకం తర్వాతే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నారు. పీసీసీ పదవిని రెడ్డికి అప్పగించాలా ? బీసీలకా ? ఎస్సీలకా ? ఎస్టీలకా ? అన్న చర్చ నడుస్తుంది.

కర్ణాటక తరహాలో తెలంగాణలో పార్టీ పగ్గాలు తనకు అప్పగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరుతున్నారు. కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పీసీసీ చీఫ్‌ కొనసాగుతున్నారు. ఇక బీసీ సామాజికవర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి.

పీసీసీ రేసులో తెరపైకి వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్కలు ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నారు. పొన్నం పీసీసీ పదవి ఇస్తే మంత్రి పదవిని వదులుకుంటానని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. సీతక్క, భట్టిలు మాత్రం దానికి ఇష్టపడడం లేదని సమాచారం. మొత్తానికి పీసీసీ అధ్యక్ష్య పదవి వ్యవహారం త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.