కేటీఆర్ 'ఠంగు' మారింది.. తత్వం బోధపడినట్టేనా!!
కానీ, తాజాగా మాత్రం.. తప్పులు తామే చేశామని ఒప్పుకొన్నారు. అంతేకాదు.. ప్రజలను కూడా తప్పుపట్టబోమన్నారు.
By: Tupaki Desk | 11 July 2024 8:30 AM GMTతెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట మారింది. నిన్న మొన్నటి వరకు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఒక లెక్కలో మాట్లాడిన ఆయన.. పార్లమెంటు ఎన్నికలు ఇచ్చిన భారీ షాక్‌తో తత్వం తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో తమది అసలు ఓటమే కాదని.. అనేక అనుమానాలు ఉన్నాయన్న ఇదే కేటీఆర్.. ఇప్పుడు దిగివస్తున్నట్టు ఆయన టంగు చెప్పేస్తోంది. ఇదేసమయంలో ఒకప్పుడు చంద్రబాబుపైనా.. టీడీపీపైనా నిప్పులు చెరిగిన కేటీఆర్.. వీరి విషయంలోనూ మాట.. మనసు రెండు మార్చేసుకున్నట్టే కనిపిస్తోంది.
అంతేకాదు.. గతంలో ఎక్కడో తప్పు జరిగిందన్న కేటీఆర్.. తమపార్టీలోనే జరిగిన విషయాన్ని గుర్తించలేక పోయారు. ఎవరిపైనో నెపం వేసేందుకు ప్రయత్నించారు. కానీ, తాజాగా మాత్రం.. తప్పులు తామే చేశామని ఒప్పుకొన్నారు. అంతేకాదు.. ప్రజలను కూడా తప్పుపట్టబోమన్నారు. రకరకాల కారణాలు ఉన్నాయని అంటూనే.. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి.. రాజకీయంగా బీఆర్ ఎస్ వ్యూహాలు చిత్తయి.. ఇప్పుడు మళ్లీ భూమార్గం పట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు.. తమ 'వైఖరి'ని కూడా కేటీఆర్ స్వయంగా తప్పుబట్టుకోవడం..ఇక్కడ వచ్చిన పెను మార్పుగానే చెప్పాలి.
గతంలో ఎవరు విమర్శించినా.. అమ్ముడు పోయారని.. తొత్తులుగా మారారని.. ఇదేకేటీఆర్ విమర్శలు గుప్పించారు. కానీ, ఇప్పుడు నాయకులు వెళ్లిపోతుండడం.. పార్టీలో కేడర్ కూసాలు కూడా కదులుతుండడం.. పార్లమెంటు ఎన్నికల ఫలితం ఇచ్చిన భారీ దెబ్బ.. ఇలా..వరుస షాకులతో కేటీఆర్ యాటిట్యూడ్ సమూలంగా మారిందని.. ఆయన టంగు కూడా ఠంగుగా మారిందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి చెప్పాలంటే.. తామేం చేసినా కరెక్టంటూ.. కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించారు. ''మా తెల్వదా.. ఏం చేయాల్నో!'' అనే మాటే ఆయన నోటి వెంట వినిపించింది. కానీ, ఇప్పుడు ''మేం తెలుసుకుంటాం'' అనే మాటకు జారిపోయారు.
ఇక, మరో కీలక వ్యవహారం.. టీడీపీ మాటన్నా.. చంద్రబాబు పేరన్నా.. అగ్గిమీద గుగ్గిలంగా మండిపడ్డ కేటీఆర్.. ఇప్పుడు చంద్ర బాబు రావొచ్చంటూ.. తెలంగాణలో రాజకీయాలు చేయొచ్చంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇది అస్సలు ఎవరూ ఊహించని పరిణామం. ఎందుకంటే..'మా ఇంటికొస్తే.. మాకేం తెస్తావ్ - మీ ఇంటికొస్తే.. మాకేం పెడతావ్'' అనే టైపులో రాజకీయాలు చేయడంలో కేటీఆర్ సహా బీఆర్ ఎస్ పరివారం రాటుదేలిన విషయం తెలిసిందే. తాము ఎక్కడైనా రాజకీయాలు చేసేందుకు పేటెంట్ ఉందని.. కానీ, ఇతరులు మాత్రం తమ అడ్డాలోకి రాకూడదన్న టైపులో 2018లోనూ 2023లోనూ వ్యవహరించారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా 'ఠంగు' మారింది. ఏదేమైనా.. ప్రజాతీర్పు మహిమే. మరి ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని.. తత్వం నేర్చుకుంటే.. కొంతైనా పరిస్థితి మెరుగు పడుతుందని అంటున్నారు పరిశీలకులు.