తెలుసుకో యువతా.. ఇదో గొప్ప సందేశం!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల ప్రక్రియ ముగిసింది. కానీ, ఫలితం వచ్చేందుకు మరో మూడు రోజుల సమయం ఉంది
By: Tupaki Desk | 30 Nov 2023 3:35 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల ప్రక్రియ ముగిసింది. కానీ, ఫలితం వచ్చేందుకు మరో మూడు రోజుల సమయం ఉంది. ఇంతలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే.. ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయి. దీనిలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం.. ఏ పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుందనే విషయాలను పక్కన పెడితే.. కీలకమైన ఓ సందేశం మాత్రం బయటకు వచ్చింది. కోట్లకు పడగలెత్తిన వారు.. అపర కుబేరులు.. దేనినైనా మేనేజ్ చేయగల ధీరోదాత్తులు మాత్రమే రాజకీయాల్లో ఉన్న సమయంలో కొంత ప్రయత్నిస్తే.. సామాన్యులకు కూడా ప్రజలు చేరువ అవుతారనే వాస్తవం బయటకు వచ్చింది.
ధీరత్వం ఉండే.. విజయం చేరువ అవుతుందా లేదా.. అనేది పక్కన పెడితే.. కనీసం ప్రజలు ముందుకు వచ్చి ఆదరిస్తారనే విషయం తథ్యమేనని తెలంగాణ ఎన్నికలు రుజువు చేశాయి. తాజాగా వచ్చిన ముందస్తు సర్వే ఫలితాల్లో.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శిరీష.. ఉరఫ్ బర్రెలక్కకు ఏకంగా 15 వేల నుంచి 18 వేల ఓట్లు రావొచ్చని.. సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇది ఒక మంచి పరిణామమేనని అందరూ చెబుతున్నారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పోటీ చేశారు. అయితే బర్రెలక్క భవితవ్యంపై 'ఆరా మస్తాన్' అనే సర్వే సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. బర్రెలక్కకు 15 వేల నుంచి 18 వేల లోపు ఓట్లు రావచ్చని పేర్కొంది. అయితే ఈమె గెలవకపోయినా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని ఆరా సర్వే వెల్లడించింది.
చేతిలో 1500 బ్యాంకులో 5000 రూపాయలతో కోటీశ్వరులతో తలపడిన బర్రెలక్క ఆ రేంజ్‌లో ఓట్లు వేయించుకోవడం.. నేటి యువతకు ఆదర్శమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా ఆమె పంచేందుకు సొమ్ములేదు. కేవలం ప్రజాదరణతోనే ఆమెకు అన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉండడం.. నిజంగా ఆమె విజయం దక్కించుకున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఈ సందేశం బలపడితే..వచ్చే ఎన్నికల నాటికి మరింత మందికి శిరీష మార్గం చూపించినట్టేనని అంటున్నారు.