తెలంగాణ అభ్యర్థుల క్రిమినల్ కేసుల వివరాలు... రేవంత్ – రాజాసింగ్ కు టై!
తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్న అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించారు.
By: Tupaki Desk | 17 Nov 2023 4:08 AM GMTతెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్న అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించారు. ఇందులో వ్యక్తిగతంగా ఎక్కువ కేసులు ఉన్న నేతల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టాప్ ప్లేస్ లో ఈక్వల్ గా ఉండగా... ఇక అధికార బీఆరెస్స్ పార్టీకి చెందిన 119 మంది అభ్యర్థుల్లో దాదాపు 56 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించింది!
అవును... ఎన్నికలు సమీపిస్తునన్ వేళ తెలంగాణలోని ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు వెలుగులోకి వచ్చాయి! నేర చరిత్ర కలిగిఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పత్రికల్లో కేసుల వివరాలు అధికారింగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే అధికారిక బీఆరెస్స్ పార్టీ తమ అభ్యర్థుల్లో 56 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతూ వాటి వివరాలను ప్రకటించింది!
అయితే ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ప్రకటిస్తున్న వివరాలు పరిశీలిస్తే.. ఈసారి ప్రతిపక్ష అభ్యర్థులపై ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అధికారికంగా ప్రతిపక్షాలు తమ పార్టీ అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించనప్పటికీ... నామినేషన్లలో ఒక్కొక్కరు వెల్లడించిన వివరాలు ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. వీటిలో 2018 ఎన్నికల సమయంతో పోలిస్తే 2023 నాటి ఎన్నికలకు కేసుల సంఖ్యల విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.
ఈ జాబితా ప్రకారం... కాంగ్రెస్, బీజేపీ నాయకులపైన క్రిమినల్ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. అయితే ఇవి అధికార బీఆరెస్స్ తమపై అక్రమంగా పెట్టిన కేసులు అని కొంతమంది చెబుతున్నప్పటికీ... వాటిలో కొన్ని స్వయంకృతాపరాధాలు ఉన్నాయనేది కామెంట్! ఈ సమయంలో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై 2018 లో 42 క్రిమినల్ కేసులు ఉంటే.. 2023 ఎన్నికల అఫిడవిట్లో 89 కేసులు ఉన్నట్టు ప్రకటించారు
ఈ విషయంలో రేవంత్ కు రాజాసింగ్ కూ టై అయ్యిందనే చెప్పాలి! బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై 2018 ఎన్నికల నాటికి 43 కేసులు ఉంటే.. 2023 నాటికి వాటి సంఖ్య 89కి చేరింది. బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై గత ఎన్నికల్లో 6 కేసులు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 59 కి చేరింది! మరో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పై నాడు ఒక్క కేసు మాత్రమే ఉండగా... ఈసారి 17 కేసులు పెండింగ్ లో ఉన్నాయి!
ఇదే సమయంలో అటు బీజేపీలోనూ, ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ పై గత ఎన్నికల్లో కేవలం 3 కేసులు ఉండగా... ఈ ఎన్నికల నాటికి వాటి సంఖ్య 40 కు చేరింది. ఇక దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు పై గతంలో ఒక్క కేస్ కూడా లేకపోగా... ప్రస్తుత అఫిడవిట్ ప్రకారం.. 27 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఇక అధికార బీఆరెస్స్ లో 2018 ఎన్నికల్లో 59 మంది అభ్యర్థులపై కేసులు ఉండగా... 2023 నాటికి ఆసంఖ్య కాస్త తగ్గి 56 మందికి చేరింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై గతంలో 54 కేసులు ఉండగా.. తాజా అఫిడవిట్ ప్రకారం.. 9 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక కేటీఆర్ పై గతంలో 16 కేసులు ఉండగా.. ప్రస్తుతం ఏడు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఇదే సమయంలో... హరీష్ రావు పై గతంలో 39 కేసులు ఉండగా, తాజా అఫిడవిట్ ప్రకారం మూడు కేసులే పెండింగ్ లో ఉన్నాయి. ఇక మిగిలిన బీజేపీ అభ్యర్థులలో గంగుల కమలాకర్ (10), సబితా ఇంద్రారెడ్డి (5), సైదిరెడ్డి (5), పాడి కౌశిక్ రెడ్డి (4), చల్లా ధర్మారెడ్డి (4), ఎర్రబెల్లి దయాకర్ రావు (3), నోముల భగత్ (3), పట్నం నరేందర్ రెడ్డి (2), పైలెట్ రోహిత్ రెడ్డి (2), దానం నాగేందర్ (2) కేసులతో ఆ జాబితాలో వరుసగా ఉన్నారు.
కాగా ఈ జాబితాను అధికార బీఆరెస్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా... మిగిలిన పార్టీలు ప్రకటించాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పత్రికలలో మినిమం మూడుసార్లు అభ్యర్థుల నేరచరిత్రను ఆయా పార్టీలు ప్రకటించాల్సి ఉంటుంది.