Begin typing your search above and press return to search.

తెలంగాణ స్పీకర్ గా అనూహ్య ఎంపిక.. తొలి దళిత.. పురుష?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి.. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. చావోరేవో లాంటి ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుని అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

By:  Tupaki Desk   |   7 Dec 2023 7:58 AM GMT
తెలంగాణ స్పీకర్ గా అనూహ్య ఎంపిక.. తొలి దళిత.. పురుష?
X

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి.. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. చావోరేవో లాంటి ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుని అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి వంటి డైనమిక్ లీడర్ ను ముఖ్యమంత్రి గా చేస్తూ ఇకపై తెలంగాణను వదులుకునేదే లేదు అనే స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఇక మిగిలింది మంత్రి వర్గ కూర్పే. ఆ తర్వాత అత్యంత కీలకమైనది స్పీకర్ ఎవరనేది..? దీనిపైన కూడా అత్యంత స్పష్టతతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఎవరో అనుకుంటే..

తెలంగాణ స్పీకర్ గా ఎవరిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది చాలా కీలక పదవి. అందులోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 39 స్థానాలు వచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఎంపికను ఆచితూచి చేపట్టాల్సి ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ తరఫున గెలిచింది 64 మంది ఎమ్మెల్యేలు. రాజకీయ సమీకరణాల ప్రకారం ఈ అంకెలు చాలా ముఖ్యం. ఇప్పటికి ఏమీ లేకున్నా.. మున్ముందు పరిణామాల గురించి చెప్పలేం కదా. అందుకే పార్టీలో సీనియర్ నాయకుడిని స్పీకర్ పదవి ఇస్తారని భావించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి స్పీకర్ పదవి దక్కొచ్చని భావించారు. కానీ, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను ఈ పదవ వరిచింది.

నాడు మంత్రి..

వికారాబాద్ నుంచి తొలిసారి 2008 ఉప ఎన్నికలో గెలిచారు గడ్డం ప్రసాద్ కుమార్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానిగా చెబుతుండేవారు. ఇక 2009 ఎన్నికల్లోనూ ప్రసాద్ కుమార్ నెగ్గారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచినవారు అత్యధికులు కొత్తవారే. మిగిలిన సీనియర్లను మంత్రి పదవులు వరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పదవి ఇచ్చారని తెలుస్తోంది. కాగా, స్పీకర్ గా ఓ దశలో ఉమ్మడి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పేరూ వచ్చింది. కానీ, ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నారు. దామోదర సామాజిక వర్గం (ఎస్సీ మాదిగ) నుంచి వచ్చిన ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ.. దళితులకు పెద్దపీట వేసినట్లయింది. కొత్త అసెంబ్లీ కొలువు దీరిన తర్వాత ఎమ్మెల్యే చేత ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వారంతా కలిసి స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ పేరును స్పీకర్ పోస్ట్ కోసం కాంగ్రెస్ పరిశీలించి సూచన ప్రాయంగా ఖరారు చేసిన నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేలు ఆయనను ఎన్నుకోవడం లాంఛనమే.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి

వికారాబాద్ ఎమ్మెల్యే అయిన గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ చేయడం ద్వారా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవికి ఎవరి పేరును పరిశీలిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం కానుంది. మరోవైపు ప్రసాద్ కుమార్ 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు.

తొలి పురుష దళిత స్పీకర్?

ఉమ్మడి రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన కె.ప్రతిభా భారతి స్పీకర్ గా వ్యవహరించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్లుగా చేశారు. అయితే, గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు స్పీకర్ కానుండడంతో తొలి దళిత స్పీకర్ గా రికార్డులకెక్కున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ పురుషుల్లో దళిత ఎమ్మెల్యేలు ఎవరూ స్పీకర్లుగా చేసినట్లు లేదు. ఈ రకంగా చూస్తే గడ్డం ప్రసాద్ కుమార్ చరిత్రలో నిలిచిపోనున్నారు.