Begin typing your search above and press return to search.

మళ్లీ పెరగనున్న రీచార్జ్‌ ధరలు..?

ఇండియాలో మొబైల్‌ వినియోగం రికార్డ్‌ స్థాయికి చేరింది. జియో వచ్చిన తర్వాత జనాలను నెట్‌కి బానిస చేసింది.

By:  Tupaki Desk   |   15 Jan 2025 2:45 AM GMT
మళ్లీ పెరగనున్న రీచార్జ్‌ ధరలు..?
X

ఇండియాలో మొబైల్‌ వినియోగం రికార్డ్‌ స్థాయికి చేరింది. జియో వచ్చిన తర్వాత జనాలను నెట్‌కి బానిస చేసింది. ఒకప్పుడు 1 జీబీ డేటా రీచార్జ్‌ చేసుకోవాలంటే ఆలోచించే వారు. కానీ ఇప్పుడు ప్రతి రోజు రెండు మూడు జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు డేటా రిచార్జ్ రేటు చాలా ఎక్కువగా ఉండేది అనుకుంటారు. కానీ ఇప్పుడు రిచార్జ్‌ చేస్తున్న మొత్తంతో పోల్చితే అప్పుడు వినియోగదారులు డేటా పై పెట్టిన ఖర్చు చాలా తక్కువ అని చెప్పాలి. ప్రతి నెల సగటున రూ.300 నుంచి రూ.400 ల వరకు మొబైల్ వినియోగదారులు డేటా కోసం ఖర్చు చేస్తున్నారు.

గత ఏడాదిలో ఇండియాలో మొబైల్‌ యూజర్లకు అన్ని కంపెనీలు షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా జియో కంపెనీ పెంచిన రేట్లకు వినియోగదారులు ఢీలా పడిపోయారు. ఈ స్థాయిలో రేట్లను పెంచడం ఏంటి అంటూ కొందరు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారాలని నిర్ణయించుకున్నారు. లక్షల మంది జియో యూజర్లు వెళ్లి పోయారు అంటూ ప్రచారం జరిగింది. అయినా కొత్తగా జియోకు వచ్చిన వారు అదే స్థాయిలో ఉన్నారు. కేవలం జియో, ఎయిర్‌టెల్‌ మాత్రమే నాణ్యమైన నెట్‌ను ఇస్తున్న కారణంగా ఆ నెట్‌వర్క్‌లు ఎంతగా డేటా రేటు పెంచినా కూడా రీచార్జ్ విషయంలో అస్సలు తగ్గడం లేదు.

2024లో డేటా రేట్లను పెంచిన మొబైల్ ఆపరేటింగ్‌ సంస్థలు మరోసారి రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. డేటా రేట్ల విషయంలో ఇప్పటికే వినియోగదారుల నెత్తిన పెద్ద బండరాయి పెట్టినట్లుగా గత ఏడాది పెంపుదల ఉంది. ఇప్పుడు మరోసారి రీచార్జ్‌ ధరలను పెంచబోతున్నట్లు తెలుస్తోంది. 2025లో అన్ని కంపెనీలు సగటున 10% రేట్లను పెంచేందుకు గాను సిద్ధం అవుతున్నాయి. ఒకటి రెండు వారాల్లో ఈ నిర్ణయంను ఏదో ఒక కంపెనీ వెలువరించే అవకాశం ఉంది.

ఒక కంపెనీ రేట్లను పెంచితే మిగిలిన అన్ని నెట్‌వర్కింగ్‌ కంపెనీలు తమ రీచార్జ్‌ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి. ప్రతి నెలకు ఇంట్లో కనీసం రెండు ఫోన్‌లు ఉంటే రూ.500 లు రీచార్జ్‌కే ఖర్చు అవుతున్నాయి. ఇంట్లో నాలుగు ఫోన్‌లు ఉంటే రూ.1000 లు మొబైల్ రీచార్జ్‌లకు అవుతున్నాయి. ఈ భారం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో అత్యధిక కస్టమర్స్ ఉన్న ఎయిర్‌ టెల్‌, జియో సంస్థలు రేట్ల పెంపు వల్ల దాదాపు 25 శాతం అధిక లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.