బోరుగడ్డ ఎపిసోడ్ లోనూ బాబు సర్కారుపై తమ్ముళ్ల ఆగ్రహం!
బాబు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని.. రాజకీయ ప్రత్యర్థుల కంటే బలంగా ప్రశ్నిస్తూ.. జరుగుతున్న పొరపాట్లను కడిగి పారేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 10 March 2025 12:00 PM ISTఅధికారంలో లేనప్పుడు జరిగే తప్పుల్ని.. సర్ది చెప్పుకోవచ్చు. చేతిలో తిరుగులేని రాజ్యాధికారం ఉన్నప్పుడు.. పార్టీ ఇమేజ్ ను.. పార్టీ అధినేత మొదలు ముఖ్యనేతల వరకు ఇష్టారాజ్యంగా మాట్లాడిన అరాచకవాదులను శిక్షించే వేళలోనూ నిర్లక్ష్యం.. తప్పులు జరగటమా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. సాధారణంగా తాము అభిమానించే.. ఆరాధించే పార్టీ అధికారంలో ఉన్న వేళలో.. పాలనలో చోటు చేసుకునే తప్పుల్ని.. వారి అభిమానులు.. కార్యకర్తలు కవర్ చేయటం.. పార్టీకి.. ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తూ.. అధినేతను కవర్ చేయటం కనిపిస్తూ ఉంటుంది. కానీ.. తెలుగు తమ్ముళ్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
బాబు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని.. రాజకీయ ప్రత్యర్థుల కంటే బలంగా ప్రశ్నిస్తూ.. జరుగుతున్న పొరపాట్లను కడిగి పారేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా వ్యవహరించిన జీవీ రెడ్డి చేత రాజీనామా చేయించటం.. అతడి విషయంలో పార్టీ అధినేత.. ముఖ్యమంత్రిచంద్రబాబు వ్యవహరించిన తీరును తెలుగుతమ్ముళ్లు సోషల్ మీడియాలో ప్రదర్శించిన ఆగ్రహం.. జీవీ రెడ్డికి దన్నుగా నిలిచిన తీరును చూసిన చాలామంది విస్మయానికి గురయ్యారు.
వైసీపీ నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు అయితే.. పండుగ చేసుకున్నారు. తాము చేయలేని డ్యామేజ్ ను తెలుగు తమ్ముళ్లే చేస్తున్నారంటూ మాట్లాడేసుకోవటం కనిపించింది. ఈ తీరును కొన్ని మీడియా సంస్థలు సైతం తప్పు పట్టాయి. అయితే.. తెలుగు తమ్ముళ్ల వాదన మరోలా ఉంది. తాము పార్టీకి.. ప్రభుత్వానికి విజిల్ బ్లోయర్లుగా ఉంటామని.. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన తప్పుల్ని చూడనట్లుగా వ్యవహరించటం వల్లే భారీ డ్యామేజ్ జరిగి.. పాలనా పగ్గాలు సైతం చేజారాయని.. అందుకే ఈసారి అందుకు భిన్నంగా బాబు చేసే తప్పుల్ని ఎవరో కాదు.. తామే ముందు స్పందిస్తామని చెబుతున్నారు. ఒక రకంగా చంద్రబాబుకు విషయం నేరుగా అర్థమయ్యేందుకే తామిలా వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు.
తప్పులు జరిగినప్పుడు చూడనట్లుగా వ్యవహరిస్తూ.. ఆ తప్పుల్ని పెంచి పెద్ద చేయటం నిజమైన అభిమాని చేసే పని కాదు. చంద్రబాబు మీద అభిమానం.. ఆయన చేసే తప్పుల మీద ఎందుకు ఉండాలి? ఆయనకు అసలు విషయం తెలిసేలా చేయటం మా కనీస కర్తవ్యం కదా? బాబు చేతిలో అధికారం లేనప్పుడు..ఆయన్ను జైల్లో పెట్టినప్పుడు రోడ్ల మీదకు వచ్చి పని చేసింది.. పోరాడింది టీడీపీ నేతలు కాదు. తామేనన్న విషయాన్ని మర్చిపోకూడదని చరిత్రను సైతం తవ్వి మరీ తమ వాదనను వినిపిస్తున్నారు తెలుగుతమ్ముళ్లు.
ప్రభుత్వాలు చేసే తప్పులను కళ్లు మూసికొని ఏమీ జరగనట్లుగా ఉండమని.. న్యాయం వైపే ఉంటామన్న వాదన తెలుగు తమ్ముళ్లది. జీవీ రెడ్డి విషయంలో జరిగిన తప్పును సైతం అందుకు ఓపెన్ గా చంద్రబాబును విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా చెబుతున్నారు. పార్టీకి విధేయుడిగాఉండే జీవీ రెడ్డి ఒకవేళ నిజంగానే తప్పు చేస్తే.. పిలిపించుకొని పర్సనల్ గా కౌన్సెలింగ్ ఇవ్వాలి. పార్టీకి.. ప్రభుత్వానికి జరిగే ఇబ్బందిని అర్థమయ్యేలా చెప్పాలే తప్పించి.. రాజీనామా చేయిస్తారా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.
జీవీ రెడ్డి ఎపిసోడ్ ముగియక ముందే.. జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారంలో ఉండి కూడా కంట్రోల్ చేయకపోవటం ఏమిటి? తప్పుడు వ్యాఖ్యలు చేయటమే కాదు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన బోరుగడ్డ జైల్లో ఉండి కూడా తన హవా నడిపించటం బాబు సర్కారు ఫెయిల్యూర్ కాకుండా ఇంకేం అవుతుంది? అని ప్రశ్నిస్తున్నారు. బోరుగడ్డ లాంటోళ్లు జైలుకు వెళ్లినప్పుడు.. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటున్న వేళ.. ఏమేం జరుగుతున్నాయి? బోరుగడ్డ లాంటోళ్లు జైల్లో ఉన్నప్పుడు ఏమేం చేస్తున్నారన్న నిఘా పార్టీ తరఫు కానీ ప్రభుత్వం తరఫు కానీ లేకపోవటాన్ని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.
మొత్తంగా జీవీ రెడ్డి ఎపిసోడ్ లో ఏ తీరును తెలుగు తమ్ముళ్లు ప్రదర్శించారో... అలాంటి తీరునే బోరుగడ్డ ఎపిసోడ్ లోనూ తెలుగుతమ్ముళ్లు స్పందిస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడు తనకు కావాల్సిన వారితో ఫోన్ లో స్వేచ్ఛగా ఎలా మాట్లాడారన్న ప్రశ్నతో పాటు.. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబుకు సమాచారం లేకపోవటం ఏమిటి? మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఉలిక్కిపడటం ఏమిటి? ఈ నిర్లక్ష్యం? అలక్ష్యంపై సీరియస్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మరి.. ఈ తీరుపై చంద్రబాబు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.