Begin typing your search above and press return to search.

1500 ఏళ్ల కిందట 'అ' ఎలా ఉండేదో తెలుసా? ఆ కళాశాలకు వెళ్లాల్సిందే

ఆయన పాలనలో విజయనగర సామ్రాజ్యమే కాదు.. తెలుగు భాష కూడా ఉన్నతంగా వర్థిల్లింది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 11:22 AM GMT
1500 ఏళ్ల కిందట అ ఎలా ఉండేదో తెలుసా? ఆ కళాశాలకు వెళ్లాల్సిందే
X

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీ కృష్ణదేవ రాయలు.. అంటే.. 15వ శతాబ్దంలోనే విజయనగర చక్రవర్తి తెలుగు భాష గొప్పదనాన్ని కీర్తించారు. ఆయన పాలనలో విజయనగర సామ్రాజ్యమే కాదు.. తెలుగు భాష కూడా ఉన్నతంగా వర్థిల్లింది. ఇక వ్యావహారిక భాషోద్యమ సారథిగా

గిడుగు రామ్మూర్తి గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన జయంతిని వ్యావహారిక భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నారు.

అ.. ఆ అప్పుడెలా?

తెలుగు భాష నేర్చుకోవడం ‘అ’తో మొదలయ్యే సంగతి తెలిసిందే. అ అంటే అమ్మ.. అని బోధిస్తూ తెలుగును నేర్పిస్తుంటారు. ఇక అక్కడినుంచి మొదలయ్యే తెలుగువారి ప్రస్థానం వేర్వేరు స్థాయిలకు ఎదుగుతోంది. మరి ఇప్పుడంటే ‘అ’ అనగానే ఒక రూపం గుర్తుకొస్తోంది. మరి గతంలో ఎలా ఉండేదో తెలుసా? ఇంకాస్త వెనక్కువెళ్తే ఐదో శతాబ్దంలో ఎలా ఉండిందో చూశారా? మరికొన్ని శతాబ్దాలు కిందట.. అంటే ఐదో శతాబ్దంలో ‘అ’ రూపం ఏమిటో చెప్పగలరా? తెలుగు రాజుల్లో ఘన కీర్తి ఉన్న కాకతీయుల కాలంలో అ, ఆలు ఎలా ఉన్నాయి? వివరించగలరా?

తెలుగు చరిత్రకు అక్కడ సమాధానం

వందల ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగువారికి తొలి శాసనంలో ఏముందో కూడా చెప్పగలదు చిత్తూరులోని పీవీకేఎన్‌ ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం. దీనిని సందర్శిస్తే.. తెలుగు లిపి మారిన విధానం.. నాటి నుంచి నేటి వరకు కవుల చిత్రాలు, వారి కవితలను భద్రపరిచారు. వివిధ పత్రికల్లో వచ్చిన తెలుగు వ్యాసాలను సేకరించి ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు జర్నలిజం కోర్సుతో పాటు నేటి తరానికి తగినట్లుగా ప్రకటనలు, సామాజిక మాధ్యమ మార్కెటింగ్, యూట్యూబర్, వైబ్‌ సైట్‌ రూపకల్పన, తెలుగు బ్లాగర్, కథన రచనలో శిక్షణ ఇస్తున్నారు.