నాగపూర్ లో హింసాత్మక ఘటనలు.. అసలేం జరిగింది?
అక్కడ రెండు వర్గాల మధ్య నెలకొన్ని వివాదం.. ఆ పట్టణాన్ని అతలాకుతలం చేస్తోంది.
By: Tupaki Desk | 19 March 2025 10:30 AM ISTకొన్ని అంశాలను తెలుగు మీడియా పెద్దగా ఫోకస్ చేయదు. ఎందుకు? అంటే.. దానికి ప్రత్యేక కారణం ఏమీ ఉండదు. కొన్ని అంశాల మీద అవగాహన లేకపోవటం.. మరికొన్ని అంశాల్నివ్యక్తిగత అభిరుచుల కోణంలో చూసి.. వదిలేస్తుంటారు. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో అలా జరుగుతుందా? అన్న సందేహం రావొచ్చు. దానికి నిలువెత్తు నిదర్శనం మహారాష్ట్ర లోని నాగపూర్ లో చెలరేగిన హింసాకాండ ఉదంతాన్ని చెప్పాలి. అక్కడ రెండు వర్గాల మధ్య నెలకొన్ని వివాదం.. ఆ పట్టణాన్ని అతలాకుతలం చేస్తోంది.
మార్చి 17 రాత్రి చోటు చేసుకున్న హింసాత్మతక ఘటనలు.. 19 ఉదయానికి కూడా తెలుగు మీడియాలో పెద్దగా కనిపించకపోవటం గమనార్హం. అదే సమయంలో జాతీయ మీడియాలో ఈ ఉదంతాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువే. అసలేం జరిగింది? నాగపూర్ ఎందుకు అట్టుడుకుతుంది? లాంటి అంశాలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్టుపై వివిధ జాతీయ మీడియా వర్గాలు ఏం చెబుతున్నాయన్నది చూస్తే..
నాగపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు కారణం.. ఒక తప్పుడు సమాచారంగా చెప్పొచ్చు. కొన్ని వదంతులు నాగపూర్ లో మతపరమైన ఘర్షణలకు కారణంగా మారాయని చెప్పాలి. శాంతికి నిలయమైన ఈ నగరంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. నాగపూర్ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని చెబుతున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. అరాచక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. అశాంతికి కారణమైన జౌరంగజేబ్ సమాధిని ఎందుకు తొలగించటం లేదు? అని ప్రశ్నించారు.
ఇంతకూ అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే.. ఇటీవల చావా చిత్రం విడుదల కావటం.. శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ ను ఔరంగజేబ్ చిత్రహింసలకు గురి చేసి హతమార్చటం.. ఈ చిత్రం తీవ్ర భావోద్వేగానికి గురి చేయటం తెలిసిందే. ఇదే సమయంలో మహారాష్ట్రలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ ఒక వివాదంగా మారింది. ఔరంగజేబు మీద ఆగ్రహం పెల్లుబికటం.. అతడిపై కోపాన్ని భారీ నిరసన ప్రదర్శన రూపంలో తెలియజేశారని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెల్లడించారు. ఔరంగజేబ్ సమాధి వద్ద వీహెచ్ పీ.. బజరంగ్ దళ్ అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేయటం. అనంతరం మత గ్రంథాన్ని కాల్చారన్న తప్పుడు సమాచారం వదంతుల రూపంలో వ్యాపించింది. ఇదే నాగపూర్ అల్లర్లకు ప్రదాన కారణం. దీంతో హిందూ.. ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఇక్కడ నాగపూర్ నగరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అత్యంత ప్రశాంతమైన నగరాల్లో దీనికి పేరుంది. 1993 నుంచి ఇప్పటివరకు ఈ నగరంలో మతపరమైన అల్లర్లు జరగలేదు. అలాంటి నగరం ఈ రోజున హింసాకాండతో మండుతోంది. చావా చిత్రం తర్వాత ఔరంగజేబు అక్రత్యాలు ప్రజలకు తెలిశాయని.. శాంభాజీ మహారజ్ వీరత్వంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నట్లుగా చెబుతున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఔరంగజేబ్ సమాధిపై జరుగుతున్న చర్చ వేల.. సోమవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాపించింది.
దీంతో వందలాది మంది అల్లరిమూకలు కాసేపటికే చేరుకున్నారు. వీరు రాళ్లు.. కర్రలు.. రాడ్లు.. కత్తులు.. .ఈటెలు.. హాకీ కర్రలతో వచ్చి.. రోడ్డు మీద వెళుతున్న వారిని వెంటాడి మరీ దాడులకు తెగబడ్డారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇదే సమయంలో రోడ్ల మీద హింసకు పాల్పడిన వారు నడిపే వాహనాలకు నంబర్ ప్లేట్లను తొలగించి మరీతిరగటం చూస్తే.. అంతా పథకం ప్రకారమే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పలు వాహనాలు దగ్థం కావటమే కాదు.. 33 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించారు. అల్లర్లకు సంబంధం ఉన్న యాభై మందిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. కొన్ని అరాచకశక్తులు హింసను రెచ్చగొట్టాయని.. మొత్తం 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు. అల్లర్లలో ముగ్గురు డీసీపీలకు కూడా గాయాలు అయ్యాయి. నాగపూర్ హింసపై మహాయుతి సర్కారును విపక్షాలు నిలదీస్తున్నాయి.
ముఖ్యమంత్రి ఫడ్నీవీస్ కారణంగా మహారాష్ట్రను మణిపూర్ మాదిరి మార్చేశారంటూ శివసేన ఉద్దవ్ వర్గం నేత ఆదిత్యా ఠాక్రే వ్యాఖ్యానిస్తునానరు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే హింస చెలరేగటం చూస్తే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎందన్నది అర్థమవుతుందన్న వ్యాఖ్య వినిపిస్తోంది. నాగపూర్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ హైటెన్షన్ వాతావరణం ఉందని చెబుతున్నారు.
నాగపూర్ హింసను చూసిన ప్రత్యక్ష సాక్ష్యులు మాత్రం అంత పెద్ద గొడవ అంత అకస్మాత్తుగా ఎలా జరిగింది? అన్న ప్రధాన ప్రశ్న తెర మీదకు వస్తోంది. ఈ మొత్తం పరిణామంపై కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ మాట్లాడుతూ.. మంత్రులు చేసే బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు కూడా ఈ హింసకు కారణమని..వారిని తక్షణమే మంత్రి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. హింసాయుత వాతావరణాన్ని కఠినంగా అణిచివేయటంతో పాటు.. ఈ తరహా హింస వెనుకున్న వారి లెక్కల్ని గట్టిగా తేల్చాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.