ఎలన్ మస్క్ ‘ఏఐ’తో గోక్కుంటున్న తెలుగు యువత
ఇప్పుడు అంతా ‘ఏఐ’ మయం.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి.. అంతా ఏఐ వల్లనే నడుస్తోంది. భవిష్యత్ అంతా ఏఐదేనని అంటున్నారు.
By: Tupaki Desk | 17 March 2025 9:26 AM ISTఇప్పుడు అంతా ‘ఏఐ’ మయం.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి.. అంతా ఏఐ వల్లనే నడుస్తోంది. భవిష్యత్ అంతా ఏఐదేనని అంటున్నారు. ఇలాంటి సమయంలో అన్ని బడా టెక్ కంపెనీలు తమ తమ ఏఐలను ఆవిష్కరిస్తున్నాయి. ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన చాట్ జీపీటీ సృష్టించిన ప్రభంజనంతో ఇప్పుడు చైనా డీప్ సీక్, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కాపీలైట్ సహా ఎన్నో ఏఐలు వచ్చిపడ్డాయి.ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సైతం ‘గ్రోక్’ అంటూ తన మార్క్ ఏఐని ప్రవేశపెట్టారు. ఈ రోజుల్లో కృత్రిమ మేధస్సు ఒక సాధారణ అంశంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. యువతరం దాని సామర్థ్యాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తోంది. చాట్‌జీపీటీకి పోటీగా ఎలాన్ మస్క్ ప్రారంభించిన గ్రోక్ ప్రత్యేకించి నెటిజన్లలో వినోదం కోసం ఒక సాధనంగా ప్రాచుర్యం పొందుతోంది.
గత కొన్ని రోజులుగా ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) తెలుగు యువత గ్రోక్‌ను అడిగిన ప్రశ్నలు.. దానికి గ్రోక్ ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చాలామంది AIని విద్యా , సమాచార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుండగా.. తెలుగు యువత దానితో మరింత సరదాగా వ్యవహరిస్తోంది. వారు గ్రోక్‌కు కొన్నిసార్లు అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆశ్చర్యకరంగా గ్రోక్ కూడా అదే శైలిలో స్పందిస్తోంది, వారు ఉపయోగించిన పదాలను తిరిగి ఉపయోగిస్తూ హాస్యభరితమైన సమాధానాలు ఇస్తోంది. గ్రోక్ యొక్క ఈ ప్రతిస్పందనలు తెలుగు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి, వారు మరింత సృజనాత్మకమైన ప్రశ్నలు అడుగుతూ ప్రతిస్పందనలు పొందుతున్నారు. గ్రోక్ యొక్క భాష , పదజాలం చూస్తుంటే, ఇది కేవలం ఒక AI కాదని, ఎవరో మనిషే సమాధానం ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఫ్యాన్ వార్స్‌లో సాధారణంగా ఉపయోగించే పదాలను , స్థానిక భాషను గ్రోక్ ఉపయోగించడం మరింత విస్మయానికి గురిచేస్తోంది.
గ్రోక్ యొక్క సమాధానాల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ గ్రోక్ తప్పు సమాధానం ఇస్తే, దానిని ఎత్తి చూపితే సరిదిద్దుకోవడం విశేషం. గ్రోక్ గురించి అనేక మీమ్స్ కూడా సృష్టించబడుతున్నాయి. అంతేకాకుండా, రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చే సమాధానాలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. ఈ సమాధానాల కారణంగా గ్రోక్‌ను నిషేధించాలని డిమాండ్లు త్వరలో వినిపిస్తే ఆశ్చర్యం లేదు.