Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుకు సుప్రీం.. టీ సర్కారుకు హైకోర్టు తలంటు

ఇటీవల కాలంలో ఈ తరహా పరిస్థితి ఎదురుకాలేదంటున్నారు. ఒకే రోజు చోటు చేసుకున్న ఈ అంశం.. రెండు వేర్వేరు అంశాల మీద కావటం గమనార్హం.

By:  Tupaki Desk   |   1 Oct 2024 4:14 AM GMT
ఏపీ సర్కారుకు సుప్రీం.. టీ సర్కారుకు హైకోర్టు తలంటు
X

అనూహ్యమనే చెప్పాలి. ఒకే రోజు ఇంచుమించు ఒకే టైంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాలకు ఇబ్బందికర పరిస్థితులు రెండు అత్యుత్తమ న్యాయస్థానాల్లో ఎదురు కావటం.. భారీగా ఎదురుదెబ్బగా మారటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో ఈ తరహా పరిస్థితి ఎదురుకాలేదంటున్నారు. ఒకే రోజు చోటు చేసుకున్న ఈ అంశం.. రెండు వేర్వేరు అంశాల మీద కావటం గమనార్హం.

ఏపీకి సంబంధించి చూస్తే.. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తనిఖీలు చేసిన విధానంపై బోలెడన్ని ప్రశ్నలు మాత్రమే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చివాట్లు పెట్టింది. సున్నిత అంశాల్ని ఓపెన్ గా అలా ఎలా చెప్పేస్తారంటూ చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు పట్టింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న వాద ప్రతివాదనల సారాంశాన్ని చూసినప్పుడు ఏపీ ప్రభుత్వ వాదన పెద్దగా నిలవలేదు. సుప్రీం వరుస ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూద్రా నీళ్లు నమిలే పరిస్థితి ఎదురు కావటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు.. చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి పడేసేలా ఉన్నాయని చెప్పాలి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న అంశానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఏం ఉన్నాయన్న అంశంపై అడిగిన ప్రశ్నలకు అంతే సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ పరిణామం ఏపీలోని వైసీపీకి కొత్త ధైర్యాన్ని ఇవ్వటమేకాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ సర్కారు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు.

ఏపీలోని అధికారపక్షం పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు తెలంగాణ అధికారపక్షానికి సైతం ఇదే పరిస్థితి సోమవారం చోటు చేసుకుంది. హైడ్రా.. మూసీ సుందరీకరణలో భాగంగా పెద్దఎత్తున ఇళ్లను ఖాళీ చేయిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నింటికిమించిన కోర్టు అనుమతుల్ని సైతం పట్టించుకోకుండా అదే పనిగా కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. హైడ్రా చేష్టలపై తీవ్రంగా తప్పు పట్టిన న్యాయస్థానం.. అవసరమైతే హైడ్రా మీదనే స్టే విధిస్తామన్న హెచ్చరిక జారీ చేశారు.

వారాంతంలో.. సెలవురోజుల్లో అసలెందుకు పని చేస్తున్నారన్న హైకోర్టు.. రాజకీయ బాసుల ఆనందం కోసం చేసే పనులతో ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదని క్లాస్ పీకారు. హైడ్రా ఏర్పాటు జీవోను పరిశీలించినప్పుడు కూల్చివేతలేకాదు.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బాధ్యత వహించాలని.. దానికి సంబంధించి ఏమేం చేశారో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది.

మొత్తంగా ఒకే రోజున ఒకే టైంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపక్షాలకు.. దేశ అత్యున్నత న్యాయస్థానం.. మరో రాష్ట్రానికి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఎదురైన ఎదురుదెబ్బలు.. వారి వేగానికి బ్రేకులు పడేలా చేయటమే కాదు.. పాలన విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లుగా చెప్పక తప్పదు.