అమెరికాలో తుపాకీ తూటా.. తెలుగు విద్యార్థి బలి!
ఇందులో భాగంగా.. ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థి నూకారపు సాయితేజ (26) చికాగో సమీపంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందారు.
By: Tupaki Desk | 30 Nov 2024 6:18 AM GMTఉన్నత చదువుల కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు వివిధ ప్రమాదాల్లో మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచీ ఇలా విదేశాల్లో మృతి చెందుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్యా పెరుగుతూనే. ఈ సమయంలో మరో తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందారు.
అవును... అమెరికాలో జరుగుతున్న వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థుల జాబితాలో తాజాగా మరొకరు చేరారు. ఇందులో భాగంగా.. ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థి నూకారపు సాయితేజ (26) చికాగో సమీపంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా రామన్నపేట గ్రామానికి చెందిన సాయితేజ నాలుగు నెలల క్రితమే మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికాకు వెళ్లారు. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే... కాల్పులు జరగడానికి గల కారణాల గురించి వివరాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి!
అయితే... సాయితేజ అమెరికాలో మాస్టర్స్ చేస్తూనే ఓ షాపింగ్ మాల్ లో పార్ట్ టైమ్ గా పనిచేస్తున్నాడని అంటున్నారు. ఈ సమయంలోనే గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారని అంటున్నారు. దీంతో సాయితేజను వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలుస్తోంది.
మరోపక్క ఈ వార్త తెలిసిన అనంతరం సాయితేజ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుమారుడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలుపెట్టుకున్న అతని తల్లితండ్రులు ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. సాయితేజ మృతదేహాని భారత్ కు తీసుకురావడానికి అమెరికాలోని తెలుగు సంఘాలు సహాయం చేస్తున్నాయని తెలుస్తోంది.