పొట్టి శ్రీరాముల పేరు మార్చారు.. పాత జ్ఞాపకం మీద అంత పగ ఎందుకు?
ఈ మధ్యన ఆ పేరును మార్చాలన్న డిమాండ్ తెర మీదకు వస్తే.. అంతెత్తు లేచారెందరో మేధావులు.
By: Tupaki Desk | 21 Sep 2024 5:00 AM GMTపాతికేళ్లు కలిసి కాపురం చేసినోళ్లు.. విడిపోయినంత మాత్రాన అగర్భ శత్రువులుగా మారాలా? సదరు పాతికేళ్ల ప్రయాణంలో చేదు జ్ఞాపకాలే కాదు తీపి గురుతులు కూడా ఉండి ఉంటాయిగా? వాటిలో తీపిని మాత్రమే తీసుకొని.. చేదును వదిలించుకోవటంలో అర్థముందా? దేశాన్ని దారుణంగా దోచేసి.. శతాబ్దాల వెనుకుబాటుకు తీసుకెళ్లిపోయిన బ్రిటీషోడి చట్టాల్ని నేటికి అమలు చేస్తుంటాం. అదే టైంలో దుర్మార్గులైన బ్రిటీష్ పాలకుల్లోనూ కాటన్ దొర లాంటోడి మంచితనాన్ని గుర్తు పెట్టుకున్నామే తప్పించి.. ఆ గురుతులే ఉండొద్దనుకోలేదు కదా? అంతేనా.. అప్పుడెప్పుడు గుంటూరుకు జిన్నా వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జిన్నా సెంటర్ అని పిలుచుకోవటం.. సదరు వ్యక్తి దేశాన్ని రెండు ముక్కలు చేసిన తర్వాత కూడా ఆ పేరును దశాబ్దాల తరబడి కొనసాగించారు. ఈ మధ్యన ఆ పేరును మార్చాలన్న డిమాండ్ తెర మీదకు వస్తే.. అంతెత్తు లేచారెందరో మేధావులు.
మరి.. అలాంటి వారికి తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయానికి శ్రీపొట్టి శ్రీరాముల పేరును తీసేసి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టటం దేనికి నిదర్శనం? పొట్టి శ్రీరాములకు.. తెలంగాణకు ఏం లింకు ఉంది? మేం ఎందుకు ఆ పేరును మోయాలి? లాంటి దరిద్రపుగొట్టు వాదనలు వినిపించే వారంతా.. ఏం లింకు ఉందని.. నిజాం పెళ్లాం పేరు మీద పెట్టిన పేర్లను ఇంకా ఎందుకు కంటిన్యూ చేయాలి?
ఇదే నిజాం అరాచకాలకు తెలంగాణ ప్రాంతం నుంచి (నాటి హైదరాబాద్ స్టేట్) గుంటూరు.. క్రిష్ణా జిల్లాలకు తల దాచుకోవటానికి వచ్చి.. అక్కడ తమ రహస్య అడ్డాలు ఏర్పాటు చేసుకొని.. నిజాం అరాచక పాలన మీద పోరాడేందుకు శిబిరాలు నిర్వహిస్తే.. వారిని ఆదరించి.. అన్నం పెట్టిన ఆంధ్రోళ్ల పెద్ద మనసును మర్చిపోవటం దేనికి నిదర్శనం? విడిపోయి కలిసి ఉందామనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందన్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. అలాంటప్పుడు విడిపోయినంత మాత్రాన కలిసి ఉండకూడదన్న రూలు లేదుగా? భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రాన్నే తీసుకుంటే.. తెలంగాణలో పాత జమానాకు సంబంధించిన గురుతుల్లో ఒకటైన పొట్టిశ్రీరాములు పేరును తీసేయటం మీద అంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించాలసిన అవసరం ఉందా?
పొట్టి శ్రీరాములకు తెలంగాణ ప్రాంతానికి సంబంధం ఏమిటంటూ లా పాయింట్ తీసేటోళ్లు చాలామందే కనిపిస్తారు. కరాఖండిగా లెక్కలు చూసే పద్దతిలో వారి వాదనలో నిజం ఉందని అనుకుందాం. పొట్టి శ్రీరాముల్ని ఆంధ్రా ప్రాంతం వాడిగా చూసే కన్నా.. ఒక అంశం మీద పోరాటం చేసే క్రమంలో అవసరమైతే ప్రాణత్యాగం చేసేందుకు వెనుకాడని ధీరత్వం సాటి తెలుగువాడికి స్ఫూర్తి అంశం కాదా? పొట్టి శ్రీరాములును ఆ కోణంలో చూడకూడదా? అన్నది ప్రశ్న. విడిపోవటం అంటే విద్వేషించుకోవటం కాదు కదా? విడిపోయిన తర్వాత కూడా ఇచ్చి పుచ్చుకోవటం కదా? అదే లేకుంటే తెలుగోళ్ల మధ్య ఐక్యత ఏముంది? అన్ని సంస్క్రతులను తనలో ఇముడ్చుకునే గొప్పదనం దక్కన్ ఘనతగా చెప్పుకునే వారికి.. పొట్టి శ్రీరాముల పేరును ఒక వర్సిటీ పేరుగా అంగీకరించటానికి మనసు లేకపోవటం దేనికి నిదర్శనం?