తెలుగు గవర్నర్ రికార్డు.. తొలిసారి మహిళా అధికారి నియామకం!
బీజేపీ నాయకుడైన వి.రామారావు తెలుగు వారు. ఈయన గతంలో సిక్కిం గవర్నర్ గా పనిచేశారు.
By: Tupaki Desk | 30 Nov 2023 3:30 PM GMTతెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో నాయకులు ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా సేవలందించారు. కోనా ప్రభాకర్ రావు, పి.శివశంకర్, మర్రి చెన్నారెడ్డి, కొణిజేటి రోశయ్య, సీహెచ్ విద్యాసాగర్ రావు, వి.రామారావు ,బండారు దత్తాత్రేయ వీరిలో ముఖ్యులు. దత్తాత్రేయ, వి.రామారావు, విద్యాసాగర్ రావు మినహా మిగతావారు కాంగ్రెస్ కు చెందిన నాయకులే. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దత్తన్నకు తొలుత కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత రెండో టర్మ్ లో గవర్నర్ గా పంపారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో నాయకుడు ఎవరికీ గవర్నర్ గిరీ దక్కదని భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కంభంపాటి హరిబాబుకు అవకాశం వచ్చింది.
ఈశాన్యమైనా ప్రత్యేకమే..
బీజేపీ నాయకుడైన వి.రామారావు తెలుగు వారు. ఈయన గతంలో సిక్కిం గవర్నర్ గా పనిచేశారు. బహుశా తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకుల్లో గవర్నర్ అయిన తొలి వ్యక్తి ఈయనేనేమో. కాగా, దత్తాత్రేయ అనంతరం విశాఖపట్టణం మాజీ ఎంపీ. 2014లో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయలక్ష్మిని ఓడించి సంచలనం రేపారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రిగానూ పనిచేశారు. 2019లో ఓటమి అనంతరం.. ఏడాది కిందట ఆయనకు మిజోరం గవర్నర్ గిరీ దక్కింది. అలా మరో తెలుగు నాయకుడు ఈశాన్య రాష్ట్రానికి గవర్నర్ అయ్యారన్నమాట.
నియామకంలో ప్రత్యేకత
మిజోరం గవర్నర్ గా ఉన్న కంభంపాటి హరిబాబు తన పనితీరులో ప్రత్యేకత చాటారు. దేశంలో గవర్నర్ ఏడీసీ (ఎయిడ్ ది క్యాంప్)గా తొలిసారి మహిళను నియమించారు. భారత ఎయిర్ ఫోర్స్ 2015 బ్యాచ్ అధికారణి, స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాఢిని ఏడీసీగా నియమించుకున్నారు. త్రివిధ దళాలకు చెందిన ఒక అధికారిని ఏడీసీగా నియమించుకునే అధికారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రమే ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్యానల్ ను ఆయా దళాలు ప్రతిపాదిస్తాయి. వీరిలోంచి కావాల్సినవారిని నియమించుకునే స్వేచ్ఛ గవర్నర్లకు ఉంటుంది. కాగా, గవర్నర్ హరిబాబు.. స్వాడ్రన్ లీడర్ మనీషా పాఢిని ఎంపిక చేశారు.
ఓ మైలురాయి ఇది..
స్వ్కాడ్రన్ లీడర్ మనీషా పాడి నియామకం ఎలాంటి ప్రత్యేకతో వివరించారు కంభంపాటి హరిబాబు. స్త్రీ, పురుష బేధాలను చెరిపేస్తూ, మహిళలు గతంలో ఎన్నడూ అడుగుపెట్టని రంగాల్లో ప్రవేశిస్తున్నారని చెప్పడానికి ఉదాహరణగా పేర్కొన్నారు. మహిళా శక్తికి నిదర్శనమని అభివర్ణించారు. ఈ అరుదైన సందర్భాన్ని గుర్తుంచుకోవడంతోపాటు ప్రతి రంగంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేయడానికి ప్రయత్నించాలి అని కోరారు.
కాగా, మనీషా.. బీదర్, పుణె, భటిండా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో స్క్వాడ్రన్ లీడర్ గా పనిచేశారు. ప్రతి గవర్నర్ కు ఇద్దరు ఏడీసీలు ఉంటారు. ఒకరు త్రివిధ దళాలకు చెందినవారు కాగా.. మరొకరు ఆయా రాష్ట్ర పోలీసు విభాగం నుంచి వస్తారు. గవర్నర్ విధి నిర్వహణలో వీరిది కీలక భూమిక... నిరంతరం వారితో నే ఉంటారు.