తెలుగు వీరులు .అటూ ఇటూ కాకుండా ఎటూ...?
కొంత డౌట్ లో పడిన నేపధ్యంలో తెలుగు పార్టీలు ఇపుడు చౌరాస్తాలో ఉండిపోయాయని అంటున్నారు.
By: Tupaki Desk | 18 July 2023 11:28 AM GMTఒకనాడు జాతీయ రాజకీయాల ను విపరీతంగా ప్రభావితం చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల కు చెందిన నాయకుల కు ఉంది. జాతీయ స్థాయిలో జనతా ప్రయోగం తరువాత ఏర్పడిన మూడు కూటముల కు తెలుగుదేశం పార్టీయే మూల సూత్రధారి అన్నది గుర్తు పెట్టుకోవాలి.
దేశ రాజకీయ చరిత్రలోకి ఒక్కసరి వెళ్తే 1977లో జనతా పార్టీ ప్రయోగాన్ని మహా నాయకుడు జయప్రకాష్ నారాయణ్ చేశారు. ఆ తరువాత పదేళ్ళకు నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావం వెనక తెలుగు వెలుగు అయిన ఎన్టీయార్ ఉన్నారు. ఆయన కృషి తోనే కుడి ఎడమలుగా ఉన్న పార్టీలు అన్నీ ఒక్క గూటికి చేరి కాంగ్రెస్ ని ఓడించాయి. ఇక 1996లో యునైటెడ్ ఫ్రంట్ కి ఊపిరి పోసింది టీడీపీ అధినాయకుడు చంద్రబాబు అయి చెప్పాలి.
అలా ఆయన ఇద్దరు ప్రధానుల ను కూడా చేశారు. ఇక 1999 నాటికి ఏర్పడిన ఎన్డీయే లో కూడా చంద్రబాబు అత్యంత కీలకమైన భూమిక పోషించారు. ఇలా టీడీపీ అనేక కూటముల ఏర్పాటులో తనవంతు పాత్రను పోషించిన నేపధ్యం ఉంది. ఆయా సమయాల్లో టీడీపీ లోనే ప్రస్తుత బీయారెస్ అధినేత కేసీయార్ ఉన్నారు.
ఇపుడు ఆయనే ఒక శక్తిగా మారి బీయారెస్ అనే జాతీయ పార్టీ గా దాన్ని పెంచి తాను కీలక పాత్ర పొషించాలని చూస్తున్నారు. మరో వైపు చూస్తే యూపీయే ఒకటి రెండు ప్రభుత్వాలు ఏర్పడడానికి ఉమ్మడి ఏపీ నుంచి అత్యధిక ఎంపీ సీట్లను కాంగ్రెస్ ద్వారా అందించారు దివంగత సీఎం వైఎస్సార్. ఆయన అలా జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్రను పోషించారు. ఇపుడు ఆయన కుమారుడు జగన్ ఏపీ నుంచి సీఎం గా ఉన్నారు.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు కేసీయార్ అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా అందరూ జాతీయ రాజకీయాల దృష్టిని ఆకర్షించిన వారే. ప్రతీ ఒక్కరూ తమదైన రాజకీయ రికార్డుల ను కలిగి ఉన్నారు. అలాంటి ఈ ముగ్గురు రాజకీయ ఉద్ధండులూ దేశం లో ప్రస్తుతం జరుగుతున్న రెండు కూటముల మధ్య రాజకీయ పోరు లో తాము ఎటు వైపో తేల్చుకోలేని పని లో పడ్డారా అన్న చర్చ అయితే సాగుతోంది.
బీజేపీ వైపు ఉన్నారన్న కారణమో అనుమానమో తెలియదు కానీ చంద్రబాబు ని జగన్ని విపక్ష కూటమి పిలవలేదు. మరో వైపు చూస్తే కేసీయార్ ని కూడా విపక్ష కూటమి పట్టించుకోలేదు. ఇక ఎన్డీయే కూటమి లో జగన్ భాగస్వామి కాదు కాబట్టి ఆహ్వానించలేదు. చంద్రబాబు తానే 2018లో తెంచుకుని వెళ్లారు కాబట్టి పిలవడం అవసరం లేదు అని బీజేపీ అనుకుంటోంది.
ఇంకో వైపు చూస్తే కేసీయార్ విషయం లో కూడా బీజేపీ దూరం అంటోంది. ఇలా ఈ ముగ్గురు నేతలూ జాతీయ స్థాయిలో రెండు కీలక జాతీయ పార్టీలూ వాటికి అనుబంధంగా ఉన్న పార్టీల తో భారీ యుద్ధ సన్నాహాలకు రంగం సిద్ధం చేస్తూంటే అసలు తెలుగు గొంతు ఎక్కడా వినిపించని పరిస్థితి. ఇది నిజంగా చిత్రమైన పరిస్థితి అని చెప్పుకోవాలి.
ఇలా ఎందుకు జరుగుతోంది. ఇది ఏపీ లోని రాజకీయ పార్టీల వ్యూహమా లేక వారి చేతిలో ఉన్న ఆప్షన్లుగా చూడాలా అన్నది కూడా తెలియడంలేదు. గతం తో పోలిస్తే దేశంలో రాజకీయం మారుతోంది. విపక్షలు ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి. దేశంలో పదకొండు రాష్ట్రాల లో అవి అధికారం లో ఉన్నాయి. దాంతో వారి బలం బాగానే పుంజుకుంటోంది.
ఇంకో వైపు చూస్తే కర్నాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు కనిపిస్తోంది. అదే టైం లో బీజేపీ తగ్గింది. ఇక తెలంగాణా ను కూడా అందుకుంటే కాంగ్రెస్ పరుగు ఇంకా పెరుగుతుంది. బీజేపీ ముచ్చటగా మూడవసారి అధికారం లోకి వస్తుందా అన్నది కూడా కొంత డౌట్ లో పడిన నేపధ్యంలో తెలుగు పార్టీలు ఇపుడు చౌరాస్తాలో ఉండిపోయాయని అంటున్నారు.
ఎటూ తేల్చుకోలేక అటూ ఇటూ అడుగులు వేయలేక సతమతం అవుతున్నాయని అంటున్నారు. అయితే ఇది కూడా ఒకందుకు మంచిదే అని అంటున్నారు. సరైన ఆప్షన్ ని సరైన టైం లో ఎంచుకునేందుకు వీలు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి తెలుగు రాజకీయ జాతీయ తెరపైన వెలిగేది ఎపుడో.