ఎన్నాళ్లకు ఈ ఇద్దరు తెలుగు ఎంపీలు తెలుగుదనాన్ని చూపారు
ఎవరేతైనేం.. తమ కల్చర్ ను అందరి ముందు ప్రదర్శించటానికి ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 25 Jun 2024 5:30 AM GMTఎవరేతైనేం.. తమ కల్చర్ ను అందరి ముందు ప్రదర్శించటానికి ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. కానీ.. అదేం దరిద్రమో కానీ తెలుగువారికి ఈ విషయంలో ఉన్ననన్ని పట్టింపులు మరే రాష్ట్రానికి చెందిన వారికి ఉండదు. నలుగురు ముందు అమ్మభాష మాట్లాడేందుకు సిగ్గుపడటం.. అత్యున్నత స్థానాల్లో ఉంటే మాత్రం అమ్మభాషకు బదులుగా అరువు భాషలో మాట్లాడేందుకు ఆసక్తిని చూపటం.. మన కట్టు.. వేషధారణను తక్కువగా చూడటం.. వాటిని పట్టించుకోకపోవటం లాంటి వాటిల్లో తెలుగు జాతికి ఉన్న తెగులు మరే జాతికి ఉండదని చెప్పాలి.
మొన్నటికి మొన్న మోడీ సర్కారు ముచ్చటగా మూడోసారి కొలువు తీరిన సందర్భంలో.. కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే వేళలో.. మలయాళ సినీ ప్రముఖుడు సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేళలో.. కేరళ సంప్రదాయబద్ధమైన పంచకట్టులో వచ్చి ప్రమాణస్వీకారం చేయటం తెలిసిందే. తమిళులు సైతం తమ వేష భాషల విషయంలో ఎంత పక్కాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దరిద్రమంతా తెలుగువారితోనే. ఇద్దరు తెలుగు ప్రముఖులు కలిసినప్పుడు.. వారి మధ్య సంభాషణ తెలుగులో కాకుండా ఇంగ్లిషులో సాగుతుంది. అంతేకాదు.. తెలుగువారి సంప్రదాయ వస్త్రాలైన పంచెను కట్టేందుకు అస్సలు ఇష్టపడరు. వేదిక ఏదైనా.. కార్యక్రమం మరేదైనా.. సంప్రదాయ వస్త్రధారణ విషయంలో తెలుగువారు అస్సలు ఆసక్తి చూపరు. మరే జాతికి లేనంత ఇబ్బంది తెలుగు జాతిలోనే ఈ దరిద్రమంతా కనిపిస్తుంది. ఈ వాదనకు చెక్ పెడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు వీరిద్దరూ ఎంపీలుగా తమ ప్రమాణస్వీకారం చేసే సమయంలో పంచెకట్టుతో వెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా కిషన్ రెడ్డి, అప్పలనాయుడు ఇద్దరు అసలుసిసలు తెలుగుజాతి ప్రతినిధిగా లోక్ సభలో ఎంపీగా ప్రమాణం చేసిన వైనం చూసినప్పుడు.. తెలుగు నాయకులంతా తమ సంప్రదాయ వస్త్రాలంకరణను ఎందుకు అనుసరించకూడదన్న భావన కలుగక మానదు. గతానికి భిన్నంగా మరో ఆసక్తికర సన్నివేశం లోక్ సభ ఎంపీ ప్రమాణస్వీకారం వేళ కనిపించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి.. రామ్మోహన్ నాయుడు.. పెమ్మసానితో సహా ఎంపీలుగా తెలుగు నేల నుంచి ఎన్నికైన వారిలో 17 మంది అచ్చ తెలుగులో.. అమ్మభాషలో ప్రమాణస్వీకారం చేయటం ఆసక్తికరంగా మారింది. ఈరోజు (మంగళవారం) మరో పదిహేను మంది తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. వారిలో ఎంతమంది తెలుగులో ప్రమాణస్వీకారం చేస్తారో చూడాలి.