భారత్ పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో తెలుగు రాష్ట్రాల స్థానమిదే
తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారో ఎంపీ.
By: Tupaki Desk | 11 Aug 2023 5:19 AM GMTరంగం ఏదైనా.. అంతర్జాతీయంగా అదరగొట్టేస్తున్న విదేశీయుల్లో ముందుంటున్నారు భారతీయులు. రాజకీయం కావొచ్చు.. సాంకేతిక రంగం కావొచ్చు.. వ్యాపారమైనా కావొచ్చు. విశ్వ వీధుల్లో తమ సత్తా చాటుతున్న భారతీయుల్లో ఎక్కువమంది తమ భారత పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్న వారే. తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారో ఎంపీ.
గడిచిన పన్నెండేళ్లలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు ఎందరు? దానికి సంబంధించిన వివరాలు రాష్ట్రాల వారీగా పేర్కొన్నారు. అదే సమయంలో ఏ సంవత్సరంలో ఎక్కువ మంది తమ పౌరసత్వాన్ని వదలుకున్నారన్న ప్రశ్నకు సమాధానాల్ని ఇచ్చారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్.
తాజాగా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. గడిచిన పన్నెండేళ్ల కాలంలో 16,63,440 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు.
అదే సమయంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2022 మధ్య కాలంలో 12,88,293 మంది తమ పౌరసత్వాన్ని సరెండర్ చేసినట్లుగా వెల్లడించారు. గడిచిన పన్నెండేళ్లలో 2022లో అత్యధికంగా పౌరసత్వాన్ని వదులుకున్నట్లుగా పేర్కొన్నారు. ఒక్క 2022లోనే 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని.. రాష్ట్రాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఢిల్లీ నిలిచింది.
ఢిల్లీ నుంచి 60,414 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకోగా.. తర్వాతి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ నుంచి 22,300 మంది, గోవా నుంచి 18,610 మంది.. మహారాష్ట్ర నుంచి 17,171 మంది, తమిళనాడు నుంచి 14,046 మంది తమ పౌరసత్వాన్ని సరెండర్ చేశారన్నారు. ఇక.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీకి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 7,256 మంది ఉంటే.. ఏపీ విషయానికి వస్తే 9,235 మంది ఉన్నట్లుగా మంత్రి వెల్లడించారు.