Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం @3PM

ఎండాకాలం కావడంతో ఉదయం పూటనే ఓటు వేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉండటంతో ఉదయమే బారులు తీరారు.

By:  Tupaki Desk   |   13 May 2024 10:59 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం @3PM
X

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు గాను తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎండాకాలం కావడంతో ఉదయం పూటనే ఓటు వేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉండటంతో ఉదయమే బారులు తీరారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ లో 55.49 శాతం, తెలంగాణలో 52.34 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధికంగా చిత్తూరులో 61.43 శాతం, విశాఖపట్నంలో అత్యల్పంగా 47.66 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్ లో 63.96 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 29.47 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. ఏపీలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగినా పోలింగ్ శాతం మాత్రం ఎక్కువగానే నమోదైంది. తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నా పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో అధికారులు చొరవ తీసుకుంటున్నారు.

హైదరాబాద్ లోని పాతబస్తీలో చాలా మంది ఓట్లు వేయకుండా ఇళ్లలోనే ఉన్నారు. దీంతో ఎన్నికల సిబ్బంది, పోలీసులు, యువత స్వచ్ఛందంగా ఇళ్లకు వెళ్లి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించినా లాభం లేకుండా పోతోంది. ఇప్పటి వరకు 29 శాతమే పోలింగ్ నమోదైందంటే ఎంత తక్కువో అర్థమవుతోంది. ఎందుకు వారు ఓటు వేయడం లేదో తెలియడం లేదంటున్నారు.

దేశంలోని చాలా చోట్ల ఓటు వేసేందుకు ముందుకు వస్తుంటారు. తమ బాధ్యతగా గుర్తిస్తారు. కానీ హైదరాబాద్ లో మాత్రం ఆ చైతన్యం ఏమైందో తెలియడం లేదు. వేగంగా దూసుకెళ్తున్న నగరం ఓటు విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోందో అంతుచిక్కడం లేదు. ఈ క్రమంలో భాగ్యనగరంలో ఓటింగ్ శాతం మెరుగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

జిల్లాల వారీగా మధ్యాహ్నం 3 గంటలకు పోలైన ఓటింగ్ శాతం చూద్దాం.

అల్లూరి సీతారామరాజు 48.87, అనకాపల్లి 53.45, అనంతపురం 54.25, అన్నమయ్య 54.44, బాపట్ల 59.49, చిత్తూరు 61.54, కోనసీమ 59.71, తూర్పు గోదావరి 52.32, ఏలూరు 57.11, గుంటూరు 52.24, కాకినాడ 52.59, క్రిష్ణ 59.39, కర్నూలు 52.25, నంద్యాల 59.3, ఎన్టీఆర్ 55.71, పల్నాడు 56.48, పార్వతీపురం 51.75, ప్రకాశం 58.14, పొట్టి శ్రీరాములు నెల్లూరు 58.14, శ్రీకాకుళం 54.27, సత్యసాయి 57.56, తిరుపతి 54.42, విశాఖపట్నం 45.91, విజయనగరం 54.31, పశ్చిమ గోదావరి 54.6, వైఎస్సార్ 60.57గా నమోదైంది.

ఓటరు పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అభ్యర్థి

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ పోలింగ్ బూత్ లో జరిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓటు వేసేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ బూత్ కు వచ్చిన ఓ ఓటరుపై చేయి చేసుకోవడం సంచలనం కలిగించింది. దీంతో ఈ ఘటన రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ఓటు వేసేందుకు వెళ్లే క్రమంలో క్యూ లైన్లో ఉన్న ఓ ఓటరు ఎమ్మెల్యేను వారించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అతడి చెంపపై కొట్టాడు. ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయి ఓటరుపై దాడికి దిగడం ఆందోళనకు కారణమైంది. ఉద్రిక్తతకు దారి తీసింది.

ఎమ్మెల్యే వర్షన్ వేరేలా ఉంది. తనను దుర్భాషలాడటంతో సహనం కోల్పోయానని చెబుతున్నారు. వైఎస్సార్ పార్టీని తిడుతూ విచ్చలవిడిగా ప్రవర్తించడం వల్లే కొట్టాల్సి వచ్చిందని చెబుతున్నాడు.