యూఎస్ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి
ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు.. అనుమానాస్పద రీతిలో చోటు చేసుకున్న వారి మరణాలు షాకింగ్ గా మారాయి.
By: Tupaki Desk | 15 Jan 2024 4:24 AM GMTఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు.. అనుమానాస్పద రీతిలో చోటు చేసుకున్న వారి మరణాలు షాకింగ్ గా మారాయి. పండుగ వేళ.. ఈ విషాద వార్త రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని తీసుకొచ్చింది. అసలేం జరిగిందన్న అంశంపై ప్రశ్నలే తప్పించి.. సమాధానాలు లభించని దుస్థితి. ఉన్నత చదువులు పూర్తి చేసుకొని.. చక్కగా సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో అమెరికాకు పంపటానికి ముందు.. అయ్యప్ప మాల వేసుకున్న అతడి తండ్రి.. ప్రత్యేకంగా పూజలు చేయించి అమెరికాకు పంపారు.
అలాంటిది వెళ్లిన రెండు వారాలకే మరణించటమా? అంటూ షాక్ కు గురవుతున్నారు తల్లిదండ్రులు. తెలంగాణ.. ఏపీకి చెందిన ఈ ఇద్దరు విద్యార్థుల విషాద ఉదంతంలోకి వెళితే.. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన వెంకన్నకు కొడుకు.. కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు దినేష్. ఇతను యూఎస్ లో ఎమ్మెఎస్ చేయటానికి డిసెంబరు 28న హైదరాబాద్ నుంచి బయలుదేరి అమెరికాకు వెళ్లాడు. కనెక్టికట్ స్టేట్ లోని ఫెయిర్ ఫీల్డ్ లోని సేక్రెడ్ హార్ట్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లారు. ఏమైందో ఏమో కానీ.. రూంలో తనతో పాటు ఉన్న ఏపీకి చెందిన మరో విద్యార్థి దినేశ్ (శ్రీకాకుళం)తో కలిసి రూంలో నిద్రపోగా.. నిద్రలోనే మరణించినట్లుగా చెబుతున్నారు.
ప్రాధమిక సమాచారం ప్రకారం విష వాయువులు పీల్చటం కారణంగానే వీరిద్దరు మరణించినట్లుగా చెబుతున్నారు. అయితే.. పోలీసులు మాత్రం పోస్టుమార్టం తర్వాతనే మరణాలకు అసలు కారణాల్ని వెల్లడిస్తామని చెబుతున్నారు. దినేశ్ మరణం గురించి సమాచారం తెలిసినంతనే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బాధితుల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడి మృతదేహాల్ని త్వరగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.