Begin typing your search above and press return to search.

కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగమ్మాయి

ఇక.. జయతో పాటు మరో భారత సంతతికి చెందిన న్యాయమూర్తి రాజ్ సింగ్ బధేషాతో సహా మొత్తం 18 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

By:  Tupaki Desk   |   21 May 2024 3:48 AM GMT
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగమ్మాయి
X

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగమ్మాయి జయ బాడిగ అదరగొట్టేశారు. కాలిఫోర్నియా జడ్జిగా ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కాలిఫోర్నియా జడ్జిగా ఎంపికైన తొలి మహిళ ఆమే కావటం విశేషం. విజయవాడలో పుట్టిన ఆమె పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న ఆమె 1991-94 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైకాలజీ.. పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు.

అనంతరం బోస్టన్ వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె.. కాలిఫోర్నియాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కు అటార్నీగా.. గవర్నర్ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలోనూ పని చేశారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ ను క్లియర్ చేసిన ఆమె.. పదేళ్లకు పైగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేవారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ ట్రయల్ అడ్వకసీలో ఫ్యాకల్టీ మెంబర్ గా పని చేశారు. మెక్ జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగా ఉన్నారు.

2022 నుంచి కోర్టు కమిషనర్ గా వ్యవహరిస్తున్న జయను ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరుంది. ఎందరికో మార్గదర్శకురాలిగా వ్యవహరించిన ఆమెను తాజాగా కాలిఫోర్నియా శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక.. జయ బాడిగ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. మాజీ ఎంపీ బాడిగ రామక్రిష్ణ.. ప్రేమలత దంపతుల కుమార్తె.

జయ తండ్రి బాడిగ రామక్రిష్ణ 2004-09 మధ్య కాలంలో మచిలీపట్నం ఎంపీగా పని చేశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు.. ఒక కుమారుడు. జయ మూడో కుమార్తె. ఇక.. జయతో పాటు మరో భారత సంతతికి చెందిన న్యాయమూర్తి రాజ్ సింగ్ బధేషాతో సహా మొత్తం 18 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.