ఇదెక్కడి వింత.. ఇది కూడా కాలుష్యమేనంట!
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Aug 2024 5:49 AM GMTఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మనదేశంలో ఢిల్లీ లాంటి నగరాలు వాయు కాలుష్యంలో ప్రపంచంలోనే టాప్ టెన్ లో ఉన్నాయి. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఒక విచిత్ర ఘటన జరిగింది. దేవాలయం గంట మోగించడం వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతుందంటూ ఒక వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విచిత్ర ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో గౌర్ సౌందర్య సొసైటీలో ఒక దేవాలయం ఉంది. ఈ ఆలయంలో తరచూ గంట మోగించడం వల్ల శబ్ద కాలుష్యం తలెత్తుతోందంటూ ఒక వ్యక్తి ఉత్తర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశాడు.
వ్యక్తి ఫిర్యాదుతో ఉత్తర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి.. సదరు సొసైటీకి నోటీసు పంపింది. గుడిలో గంటలు మోగించడం వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతోందంటూ నోటీసులో పేర్కొంది. ఈ మేరకు తమకు ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారని తెలిపింది. ఈ నేపథ్యంలో శబ్ధ కాలుష్యాన్ని అరికట్టడానికి సొసైటీ చర్యలు తీసుకోవాలని కోరింది.
కాగా దేవాలయంపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ముదిత్ బన్సల్. ఇతడు కూడా గౌర్ సౌందర్య సొసైటీలోనే నివసిస్తున్నాడని సమాచారం. జూలై 30న అతడు ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆ దేవాలయంలో శబ్ద కాలుష్యం ఎంత ఉందో పరిశీలించారు. గుడి గంట మోగించినప్పుడు 70 డెసిబుల్స్ శబ్దం వస్తోందని తేలింది.
ఈ నేపథ్యంలో శబ్ద కాలుష్యానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సొసైటీని ఆదేశించారు. గుడి గంట మోగించడం వల్ల స్థానికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సొసైటీపైనే ఉందని తెలిపారు.
తాము జారీ చేసిన నోటీసులకు సొసైటీ సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కోరారు. కాగా ఆ వ్యక్తి దురుద్దేశపూరితంగా కావాలనే ఫిర్యాదు చేశాడని సొసైటీ వాసులు మండిపడుతున్నారు. గుడికి వెళ్లినప్పుడు ఎవరైనా ఒక్కసారే గంట కొడతారని.. అది కూడా అందరూ కొట్టరని.. దానికే శబ్ధ కాలుష్యం ఎలా వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.