ఘోరం: మెడికల్ కాలేజీలో ఫైర్ యాక్సిడెంట్.. 10 మంది చిన్నారులు సజీవ దహనం
విన్నంతనే మనసు వికలమయ్యే దారుణ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 16 Nov 2024 4:02 AM GMTవిన్నంతనే మనసు వికలమయ్యే దారుణ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నా.. ఇప్పటికి దేశ ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. ఎప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి విరుచుకుపడుతుందో అర్థం కాని అయోమయం. ఏదో లక్కీగా బతికేస్తున్నాం కానీ.. ఏ క్షణంలో.. ఏ ప్రమాదం కారణంగా ప్రాణాలు పోవన్న గ్యారెంటీ లేదు. అలాంటి హామీ ఇచ్చే రాజకీయ పార్టీ కానీ.. పాలకుడు కానీ లేని దారుణ స్థితిలో దేశం ఉంది. ఎందుకిదంతా అంటే.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న తాజా పరిణామమే.
ఝూన్సీలోని మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ (తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే చిన్నారులకు ఈ వార్డులో చికిత్స ఇస్తారు) లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. మహారాణీ లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ లో మంటలు చెలరేగాయి. ఇంక్యుబేటర్ లో ఉన్న పది మంది చిన్నారులు ఈ మంటల్లో సజీవ దహనమయ్యారు. మంటలతో అక్కడ భీతావహ వాతారణ పరిస్థితులు చోటు చేసుకుంది. మంటల వ్యాప్తితో రోగులు.. ఆసుపత్రి సిబ్బంది ఎవరికి వారు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్నంతనే అగ్నిమాపక శాఖతో పాటు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమయానికి వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటల చెలరేగటంతో ఒక్కసారిగా చిన్నారుల తల్లిదండ్రులు.. తమ పిల్లల్ని తీసుకొని బయటకు పరుగులు తీశారు. మంటలు చెలరేగిన కాసేపటికే దట్టమైన పొగ అలుముపుకోవటంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటల వేళలో ఈ దారుణ ఉదంతం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు చేపట్టినా.. పది మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మంటలు చెలరేగిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న 37 మంది చిన్నారుల్ని రక్షించి..బయటకు తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదానికి కారణం ఎప్పటిలానే షార్ట్ సర్క్యూట్ అంటూ అధికారులు ప్రకటన చేశారు. చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఉండే సున్నిత ప్రాంతాల్లో షార్ట్ సర్య్యూట్ సమస్యలు తలెత్తకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవటం లేదన్నది ప్రశ్న. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అవినాశ్ కుమార్, ఆయన యంత్రాంగం మెడికల్ కాలేజీ ప్రాంగణానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. ఈ ఘటన బాధాకరమన్నారు.
ఎప్పటిలానే.. ఈ ఘోర ఘటనకు కారణం ఏమిటి? ఎలా జరిగింది? అన్న విషయాల్ని వెంటనే తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదేశాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్.. ఆరోగ్య శాఖ కార్యదర్శి ఝూన్సీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు.. మెడికల్ కాలేజీ వద్ద పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. మంటల్లో కాలిపోయి మరణించి చిన్నారులను చూసిన కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. అక్కడి వాతావరణం వేదనాభరితంగా మారింది.