తెనాలి సంఘటన : ఓటరు వివరణ
క్యూలో నిలబడి లోపలికి వెళ్లాలని నేను ఎమ్మెల్యే పక్కన ఉన్న వ్యక్తులకు చెప్పాను.
By: Tupaki Desk | 13 May 2024 7:17 PM GMT''నేను ఇవాళ ఉదయం 7.05 గంటలకు ఓటేసేందుకు పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడ్డాను. ఆ సమయంలో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ఓటేసేందుకు వచ్చారు. క్యూలో నిలబడి లోపలికి వెళ్లాలని నేను ఎమ్మెల్యే పక్కన ఉన్న వ్యక్తులకు చెప్పాను. వారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.
నేను క్యూలైన్లో రమ్మని చెప్పడంతో ఎమ్మెల్యే వాళ్లకు కోపం వచ్చింది. ఓటేసి బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కుమారుడు దురుసుగా మాట్లాడాడు. తన అనుచరులతో మాట్లాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నా వద్దకు వచ్చి ఎవడ్రా నువ్వు? అంటూ నన్ను కొట్టాడు.
అప్పటికప్పుడు కలిగిన ఆవేశంతో నేను తిరిగి ఎమ్మెల్యేను కొట్టాను. దాంతో ఏడెనిమిది మంది వ్యక్తులు నన్ను కిందపడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వాళ్లెవరో తెలియదు కానీ, చూస్తే గుర్తుపడతాను.
నేను మద్యం తాగి ఉన్నానని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదు. నేను మద్యం తాగి ఐదారునెలలైంది. ఇవాళ నేను మద్యం తాగి ఉంటే నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షించుకోవచ్చు.
అంతేకాదు, నేను అసభ్యంగా దూషించినట్టు చెబుతున్నారు... కావాలంటే పోలింగ్ బూత్ లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని చూసుకోవచ్చు. నేను ఎవరినీ ఒక్క మాట కూడా దూషించలేదు. క్యూలైన్లో నిలబడి ఓటేయండి అని మాత్రమే అన్నాను అని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను చెంపదెబ్బ కొట్టిన ఘటనపై ఓటరు గొట్టిముక్కల సుధాకర్ తన వివరణను వెల్లడించాడు.