జగన్ మీద టీడీపీ ఏమో అల్లరి.. పవన్ ఏమో సైలెన్స్.. ఏంటీ కన్ఫ్యూజన్?
దీంతో ‘పగతో రగిలిపోతున్న బొమ్మాళీ’ అంటూ టీడీపీ శ్రేణులు అల్లరి చేస్తుండగా.. జనసేన అసెంబ్లీలో సైలెన్స్ పాటిస్తోంది.
By: Tupaki Desk | 25 Feb 2025 9:00 AM GMTసజాతి దృవాలు వికర్షించుకుంటాయి.. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి.. ఈ ఫిజిక్స్ ఫార్ములా ఏపీలో కూటమి కట్టిన టీడీపీ, జనసేనలకు అస్సలు సరిపోవడం లేదు. తమను ముప్పుతిప్పలు పెట్టిన జగన్ పై అసెంబ్లీలో పట్టుపట్టాలని టీడీపీ కారాలు మిరియాలు నూరుతుంటే.. అబ్బే ఈ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి మాది రాయలసీమ పార్టీ కాదంటూ పవన్ కళ్యాణ్ మౌనం దాలుస్తున్నారు. దీంతో ‘పగతో రగిలిపోతున్న బొమ్మాళీ’ అంటూ టీడీపీ శ్రేణులు అల్లరి చేస్తుండగా.. జనసేన అసెంబ్లీలో సైలెన్స్ పాటిస్తోంది.
తెదేపా శ్రేణులు అసెంబ్లీలో జగన్‌పై ప్రతీకారానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అసెంబ్లీ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో జగన్‌పై దాడి చేయడమే కాక, ఆయనను ఏ విధంగానైనా ఎదుర్కోవాలని తెదేపా ఎమ్మెల్యేలు, మంత్రులు కాచుకుని కూర్చున్నట్టున్నారు. "జగన్ ఎప్పుడు వస్తాడని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మమ్మల్ని అవమానించిన జగన్ ను అసెంబ్లీలో అవమానించాలని బాగా ప్లాన్ చేసుకున్నట్టు తెదేపా వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఇక ఇలాంటి వివాదాలకు దూరంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తమకు ఈ గొడవల కంటే ఎక్కువగా ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. "ప్రజలకు ఉపయోగపడే చర్చలు జరగాలి, అసెంబ్లీలో అనవసరమైన అలజడి సృష్టించడం మానాలి" అనే విధంగా జనసేన వైఖరిని కొనసాగిస్తూ తన ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నారు. దీన్ని చూసి కొన్ని వర్గాలు "ఇది ఏమిటి? ఒకవైపు తెదేపా ఆందోళన, మరోవైపు జనసేన నిశ్శబ్దం.. అసలు కలిసి పనిచేస్తున్నారా?" అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నాయి.
- ఎందుకు ఈ వ్యూహ భేదం?
తెదేపా ఇప్పటికీ అసెంబ్లీలో జగన్ కి ఇచ్చే ప్రతిస్పందనలో కఠినంగా ఉండాలని భావిస్తోంది. గత ఐదేళ్ల పాలనపై అసెంబ్లీలోనే కాకుండా, బయట కూడా వైసీపీని ఎదుర్కొనే దిశగా పార్టీ ముందుకెళ్తోంది. అయితే జనసేన దీనికి భిన్నంగా రాజకీయాలను ప్రజా సమస్యల చుట్టూ నడిపించాలని భావిస్తోంది.
ఈ వ్యూహ వ్యత్యాసం పార్టీ శ్రేణుల్లోనే కాకుండా మద్దతుదారుల మధ్యనూ చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తెదేపా శ్రేణులు జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటే.. పవన్ మాత్రం 'ప్రజా ప్రయోజనమే ముఖ్యం' అనే విధంగా వ్యవహరించడం చూస్తుంటే ఈ రెండు పార్టీలు కలసికట్టుగా ముందుకు వెళ్తున్నారా? అనే సందేహాన్ని రేకెత్తిస్తోంది.
ఇదే రాజకీయంగా కీలకమైన సమయం. తెదేపా-జనసేన కూటమి తమ మధ్యన వ్యూహాలను సమన్వయం చేసుకుంటే, ఇది వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారొచ్చు. లేదంటే ఈ వ్యూహ భేదం వైసీపీకి ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది.