రఘురామ నియోజకవర్గంలో ఐపీఎస్ సునీల్ మనుషులు? ఏమవుతోంది?
తన నియోజకవర్గంలో ఐపీఎస్ సునీల్ మనుషులు తిరగడాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామ సీరియస్ గా తీసుకున్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 11:30 AM GMTడిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.. అయితే తాజాగా, రఘురామ నియోజకవర్గం ఉండి పరిధిలోని ఆకివీడులో పోలీసు స్టిక్కర్లు ఉన్న కారులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఫొటోతో ముగ్గురు వ్యక్తులు హల్ చల్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు ఏదో ప్లాన్ తోనే ఆకివీడు వచ్చారని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫైర్ అవుతున్నారు.
కాగా, తన నియోజకవర్గంలో ఐపీఎస్ సునీల్ మనుషులు తిరగడాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామ సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆయన ఇన్నోవా కారులో ఆకివీడు వచ్చిన వారి కోసం తాను ఆరా తీస్తున్నానని చెప్పారు. గుత్తికొండ వెంకట జోగారావు అనే వ్యక్తికి చెందిన కారులో వచ్చిన ముగ్గురు రౌడీయిజం చేశారని ఆరోపించారు. పోలీసు స్టిక్కర్ తగిలించుకున్న వ్యక్తులకు ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. పట్టపగలు రౌడీయిజం చేయడానికి వస్తే పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఐపీఎస్ సునీల్ చెబితేనే వారు ఆకివీడు వచ్చారని తనకు తెలిసిందని రఘురామ చెప్పారు.
సునీల్ కుమార్ అనుచరుడైన కారు యజమాని జోగారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ మిషన్ పేరుతో ఆగఢాలు ఎక్కువ చేస్తున్నారని, ఆ సంస్థకు తనకు సంబంధం లేదని రఘురామ చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. ఆకివీడు ఘటనకు సునీల్ కుమార్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రశాంతమైన ప్రాంతంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఎవరినీ వదిలిపెట్టేది లేదు’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సునీల్ కుమార్ ను టీడీపీ వదిలిపెట్టినా తాను ఉపేక్షించనని చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని తన హృదయానికి తెలుసు అని అన్నారు.
అయితే ఆకివీడులో ఆక్రమణల తొలగింపు సందర్భంగా కొందరు సునీల్ కుమార్, అంబేద్కర్ ఫొటోలతో పట్టణంలోకి వచ్చారు. వారు స్థానికులు కాకపోవడంతో గొడవ చేసేందుకు వచ్చారనే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కారుతోపాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.