తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్... గన్నులతో హల్ చల్!
అయితే వైసీపీ నేతల కవ్వింపు చర్యలే అందుకు కారణం అని మరొకరు చెబుతున్నారు.
By: Tupaki Desk | 20 Aug 2024 4:59 PM GMTఅనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి సుమారు మూడు నెలల తర్వాత రావడంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారని అంటున్నారు. అయితే వైసీపీ నేతల కవ్వింపు చర్యలే అందుకు కారణం అని మరొకరు చెబుతున్నారు. ఏది ఏమైనా, కారకులు ఎవరైనా తాడిపత్రిలో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది.
అవును... తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టిన అనంతరం వైసీపీ నాయకుడు మురళి తమను కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ కారణంతో ఆయన ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారని తెలుస్తోంది. ఈ ఘటనతో తాడిపత్రిలో మరోసారి వాతావరణం వేడెక్కింది.
ఈ దాడిలో రఫీ అనే వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపు చేశారు. ఈ సమయంలో పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించేశారని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన జిల్లా ఎస్పీ జగదీష్... ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితులు అదుపులోనే ఉనాయని.. పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించామని తెలిపారు!
ఈ సందర్భంగా స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి... మురళీ తుపాకీ చూపించడం వల్లే తమ కార్యకర్తలు రెచ్చిపోయారని అన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారని పోలీసులకు ముందే తెలిసినా నిలువరించే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా తాము తాడిపత్రిలో ప్రశాంతత కోరుకుంటున్నట్లు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈ మేరకు పోలీసులు సహకరించాలని అన్నారు!
మరోవైపు తనను చంపడమే జేసీ ప్రభాకర్ రెడ్డి లక్ష్యమని .. అందుకే టీడీపీ నేతలు తన ఇంటిపై దాడి చేశారని.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాను తాడిపత్రికి వెళ్తానని.. తాడిపత్రి నుంచే జేసీ ఆరాచకాలపై పోరాటం చేస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని చంపింది జేసీనే అని వెల్లడించారు!