Begin typing your search above and press return to search.

క్వాష్ పిటిషన్ కౌంట్ డౌన్ : టీడీపీలో యమ టెన్షన్ !

ఈ పిటిషన్ని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ ఐటెం నంబర్ 62 కింద లిస్ట్ చేసింది. దాంతో టీడీపీ శ్రేణులలో నరాలు తెగె టెన్షన్ నెలకొంది.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:40 PM GMT
క్వాష్ పిటిషన్ కౌంట్ డౌన్ : టీడీపీలో యమ టెన్షన్ !
X

టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ శత కోటి ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటిషన్ మంగళవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. అంటే మరి కొద్ది గంటలలో అన్న మాట. ఈ పిటిషన్ని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ ఐటెం నంబర్ 62 కింద లిస్ట్ చేసింది. దాంతో టీడీపీ శ్రేణులలో నరాలు తెగె టెన్షన్ నెలకొంది.

చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉండడం మంగళవారంతో పాతిక రోజులు పూర్తి అవుతుంది. క్వాష్ పిటిషన్ అంటే తన మీద సీఐడీ పెట్టిన కేసులు మొత్తం కొట్టేయాలని, అలాగే ఎఫ్ఐఆర్ ని పూర్తిగా కొట్టేయాలని బాబు తరఫున న్యాయవాదులు కోర్టు ముందుకు తెస్తున్నారు.

అయితే సీఐడీ ఈ కేసుని 2021లో టేకప్ చేసింది. దాదాపుగా రెండేళ్ళుగా కేసు విచారణ సాగుతోంది. బాబుని ఏ 37గా చేర్చింది. ఆయనకు ముందు 36 మందిని విచారించింది. ఈ కేసులో లోతైన విచారణ జరిగిందని సీఐడీ చెప్పబోతోంది. ఎఫ్ఐఆర్ ని కొట్టేయడం ఈ దశలో అయ్యే పనేనా అన్న చర్చ కూడా వస్తోంది.

హైకోర్టు క్వాష్ పిటిషన్ ని పక్కన పెట్టేసిన సందర్భం కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు న్యాయ నిపుణులు. కేసు విచారణ జరుగుతున్న నేపధ్యం ఉంది. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసులో ఏమి చెప్పబోతోంది, విచారణ అనంతరం తీర్పు ఏ విధంగా వస్తుంది అన్నది కూడా ఏపీ సహా తెలుగు రాజకీయ వర్గాలలో తీవ్రమైన ఆసక్తిని పెంచుతోంది.

ఒక వేళ బాబు పెట్టుకున్న క్వాష్ పిటిషన్ ని కొట్టేస్తే మాత్రం టీడీపీకి కోటి ఏనుగుల బలం వచ్చినట్లే. చంద్రబాబు మీద ఏ కేసు లేనట్లే. ఆయన బయటకు నిక్షేపంగా వస్తారు. టీడీపీ వ్యూహం ఆ విధంగా సక్సెస్ అవుతుంది. అంతే కాదు బెయిల్ కూడా పక్కన పెట్టి టీడీపీ చేస్తున్న పోరాటానికి సార్ధకత దక్కుతుంది. పాతిక రోజుల బాబు జైలు జీవితానికి ఒక లాజికల్ ఎండ్ కార్డ్ పడుతుంది.

కానీ క్వాష్ పిటిషన్ మీద వ్యతిరేక తీర్పు వస్తే సంగతేంటి అన్నది కూడా టీడీపీలో చర్చగా ఉంది. చంద్రబాబు అపుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బెయిల్ ఈ దశలో ఆయనకు లభిస్తుందని అంటున్న వారూ ఉన్నారు. అయితే బెయిల్ మీద బాబు బయటకు వచ్చినా తన మీద సీఐడీ కేసులు ఉన్నాయని వైసీపీ ఒక ఆయుధంగా చేసుకుని ప్రచారం చేస్తుంది. ఇక ఈ కేసులు విచారణలు తలనొప్పులు బాబుకు తప్పకుండా వెంటాడుతాయి. ఆయన తాను నిప్పు అని ఎప్పటికీ చెప్పుకోలేరు.

దాంతో క్వాష్ పిటిషన్ మీద సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు సానుకూలంగా రావాలని తమ్ముళ్ళు ముక్కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మరి కొద్ది గంటలలో ఏమి జరగబోతోంది అన్నది తేలుతుంది. అది ఏపీ రాజకీయాలను కూడా విశేషంగా ప్రభావితం చేస్తుంది అని అంటున్నారు.