కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు చెదలు తినేశాయి!
డబ్బులను దాచుకునే విషయంలో ఇంటికంటే బ్యాంకు పదిలం... ఇంటి బీరువా కంటే బ్యాంకు లాకర్ పదింతలు పదిలం అని అంటుంటారు.
By: Tupaki Desk | 29 Sep 2023 8:18 AM GMTడబ్బులను దాచుకునే విషయంలో ఇంటికంటే బ్యాంకు పదిలం... ఇంటి బీరువా కంటే బ్యాంకు లాకర్ పదింతలు పదిలం అని అంటుంటారు. అవసరమైన మేర ఇంట్లో ఉంచుకుని.. మిగిలిన సొమ్ము, విలువైన ఆభరణాలు బ్యాంకు లాకర్లో దాచుకుంటే సేఫ్ అని చెబుతారు. అయితే అక్కడ కూడా సేఫ్ కాదు అనే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కరెన్సీ చెదలపాలయ్యింది.
అవును... ఒక మహిళ తన కుమార్తె పెళ్లి కోసమని రూపాయి రూపాయి పోగేసింది. పోగైన మొత్తంతో కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ఎన్నో ఆశలుపెట్టుకుంది. అయితే అంత డబ్బు ఇంట్లో ఉంటే సేఫ్ కాదని బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసి, అందులో దాచుకుంది. కానీ... విధి వక్రీకరించింది.. కరెన్సీ నోట్లు చెదలు పట్టి పాడైపోయాయి!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో అల్కా పాఠక్ అనే మహిళ గతేడాది అక్టోబరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఏషియానాశాఖలోని లాకర్ లో రూ.18 లక్షలు దాచుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల బ్యాంకు అధికారులు ఆమెను సంప్రదించారు. లాకర్ ఒప్పందాన్ని రెన్యువల్ చేయించుకునేందుకు బ్యాంకుకు రావాలని కోరారు.
దీంతో కేవైసీ వివరాలను అప్ డేట్ చేయించుకునేందుకు ఆ మహిళ బ్యాంకుకు వెళ్లింది. ఈ క్రమంలో తాను భద్రపరిచినవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదోనని చూసుకునేందుకు అల్కా పాఠక్ తన లాకర్ ను తెరిచారు. దీంతో అక్కడ పరిస్థితి చూసి ఆమె షాకైంది. లాకర్ లో ఉన్న డబ్బంతా చెదలు పట్టి కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ మహిళ లబోదిబో మంంది.
కూతురి పెళ్లి కోసం ఎంతో కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బంతా ఇలా చెద పురుగులు తినేయడంతో ఆమె పుట్టెడు దుఖఃలో మునిగిపోయారు. ఈ ఘటనతో బ్యాంకు అధికారులు కూడా షాక్ కు గురయ్యారు. అయితే ఈ విషయంపై మీడియా ఒత్తిడి పెరగడంతో ఈ అంశంపై నివేధికను తమ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి పంపినట్లు సిబ్బంది చెబుతున్నారు. అయితే.. ఆ మహిళ పరిస్థితి చూసి చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు.