ఉగ్రవాదం.. గాడిదలు.. బిచ్చగాళ్లు.. దాయాది దరిద్రం
భారత్ చంద్రుడి మీద కాలుపెడితే.. మనమేమో అడుక్కుంటున్నాం.. భారత్ నాయకత్వాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. ఇవీ ఓ దేశ అగ్ర నాయకుల నుంచి వ్యాఖ్యలు.
By: Tupaki Desk | 28 Sep 2023 6:03 PM GMTభారత్ చంద్రుడి మీద కాలుపెడితే.. మనమేమో అడుక్కుంటున్నాం.. భారత్ నాయకత్వాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. ఇవీ ఓ దేశ అగ్ర నాయకుల నుంచి వ్యాఖ్యలు. ఇంతగా భారత్ మీద ప్రశంసలు కురిపిస్తున్న వారి కడుపులో ఒకప్పుడు అత్యంత విద్వేషం ఉండేది. ఉగ్ర వాదులను ఎగదోయడం.. భారత్ లో పేలుళ్లకు పాల్పడినవారికి ఆశ్రయం ఇవ్వడం.. భారత్ తో ఎక్కడంటే అక్కడ కయ్యానికి కాలుదువ్వడం చేసేవారు. అలాంటి వారు ఇప్పుడు బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ఆ దేశాన్ని కాదు.. అక్కడి నాయకులను నిందించాలి. ఎందుకంటే.. ఏ దేశాన్నైనా నడిపేది నాయకులే కాబట్టి. దార్శనికత లోపించిన అలాంటి వారి చేతుల్లో పడితే ఏమవుతుందో అనేక ఉదాహరణలున్నాయి.
గాడిదలు అమ్ముకుంటూ..
మన కంటే ఒక్క రోజు ముందుగా 1947 ఆగస్టు 14న స్వాతంత్ర్యం పొందింది పాకిస్థాన్. కానీ, భారత్ల్ లౌకిక దేశంగా ఆవిర్భవిస్తే.. పాక్ మాత్రం మత రాజ్యంగా ఉండిపోయింది. దీనికి ఏమీ తప్పు పట్టలేం. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలే కీలకం. పారిశ్రామికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా దేశాన్ని ముందుకు నడిపించడంలో పాకిస్థాన్ పాలకులు విఫలమయ్యారు. కొన్నేళ్లుగా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ముందు చేతులు చాచాల్సి వచ్చింది. కాగా,దీనికి మరోవైపున చూస్తే.. భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ.. మూడు దశాబ్దాలుగా అశాంతి రేపుతోంది.
చైనాతో చెలిమి..
భారత్ నుంచి విడిపోయిన పాక్.. మన దేశంపైనే కత్తిదూస్తోంది. అంతేగాక ఏమాత్రం నమ్మదగని చైనాతో చెట్టాపట్టాల్ వేసుకుని నడుస్తోంది. వన్ బెల్ట్ వన్ రోడ్ వంటి వివాదాస్పద ప్రాజెక్టుకు తలూపింది. కాగా ,చైనాకు గాడిదలను సైతం ఎగుమతి చేసేంత దిగజారింది పాకిస్థాన్. ఇప్పుడు ఆ దేశానికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమంటే.. విదేశాల్లో అత్యధిక శాతం యాచకులు పాకిస్థాన్ వారేనని.
అరెస్టవుతున్నవారిలో 90 శాతం వారేనట..
విదేశాల్లో యాచన చేస్తూ అరెస్టవుతున్న వారిలో 90 పాకిస్థాన్ వారేనని తేలింది. అత్యంత పవిత్రమైన మక్కా మసీదులో పట్టబడుతున్న జేబు దొంగల్లో పాక్ జాతీయులే అధికంగా ఉన్నట్లు బయటపడింది. ఇదెవరో ఆ దేశం అంటే గిట్టనివారు చేస్తున్న ప్రచారం కాదు.. పాకిస్థాన్ ప్రభుత్వం అత్యున్నత చట్ట సభలో చెప్పిన సంగతి. విదేశాల్లో పాకిస్థాన్ ప్రజలకు సంబంధించి పాక్ సెనేట్ లో చర్చ సందర్భంగా వెల్లడించింది.
విదేశీ వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ దీనిని చర్చించడం గమనార్హం.
ఇరాన్, ఇరాక్, సౌదీలకు తోడు జపాన్..
పాకిస్థాన్ నుంచి టూరిస్ట్ వీసాపై సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వెళ్తున్నవారు యాచనకు దిగుతున్నారని పాక్ సెనేట్ కు వెల్లడించిన సమాచారంలో పేర్కొన్నారు. విచిత్రం ఏమంటే.. పాక్ యాచకులకు ఇప్పటిదాకా పశ్చిమాసియా దేశాలు వేదికగా ఉండేవి. వారికిప్పుడు జపాన్ గమ్యస్థానం అవుతుండడం.
కొసమెరుపు: "భారత్ చంద్రుడి మీదకు వెళ్తుంటే.. మనం అడుక్కుతింటున్నాం".. అని ఇటీవల పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. బహుశా దానర్థం ఇదేనేమో..?