రాణా టు విజయ్ మాల్యా.. ఆ ఐదుగురు భారత్ కు మోస్ట్ వాంటెడ్!
అవును... భారర్ పై కొంతమంది ఉగ్రదాడులు చేసి విదేశాల్లో దాక్కుంటే.. మరికొంతమంది ఆర్థిక ఉగ్రవాదులుగా మారి స్వదేశాన్ని ముంచి, విదేశాల్లోని కలుగుల్లో దాక్కున్నారని అంటారు.
By: Tupaki Desk | 26 Jan 2025 3:57 AM GMT2008 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో దోషిగా తేలిన తహవుర్ హుస్సేన్ రాణా ను భారత్ కు అప్పగించేందుకు అమెరికాలోని సుప్రీంకోర్టు ఆమోదించింది. దీంతో... అతడు న్యూఢిల్లీకి ఎప్పుడు తీసుకురాబడతాడనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో రాణా లాంటి ఉగ్రవాదులతో పాటు ఆర్థిక నేరగాళ్ల విషయంలోనూ భారత్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందని అంటున్నారు.
అవును... భారర్ పై కొంతమంది ఉగ్రదాడులు చేసి విదేశాల్లో దాక్కుంటే.. మరికొంతమంది ఆర్థిక ఉగ్రవాదులుగా మారి స్వదేశాన్ని ముంచి, విదేశాల్లోని కలుగుల్లో దాక్కున్నారని అంటారు. ఈ సమయంలో నేరస్థులు, ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా మారినట్లు చెబుతున్న యూఎస్ కు పారిపోయిన వారందరినీ వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది!
ఇందులో భాగంగా అటు ఉగ్రవాదులు, ఇటు ఆర్థిక నేరగాళ్లతో కూడిన ఐదుగురి జాబితాను సిద్ధం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం... వారిని తిరిగి భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెబుతున్నారు. ఈ విషయంలో ట్రంప్ మద్దతు బలంగా దొరుకుతుందని నమ్ముతున్నట్లు కథనాలొస్తున్నాయి! ఈ నేపథ్యంలో వారు ఎవరెవరు అనేది ఇప్పుడు చూద్దామ్..!
తహవుర్ హుస్సేన్ రాణా:
పాకిస్థాన్ కు చెందిన కెనడా జాతీయుడైన తహవుర్ హుస్సేన్ రాణా.. ముంబై దాడుల్లో 160 మందికిపైగా మరణించడానికి గల కారణాల్లో కీలకమైన వ్యక్తి! పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసిన మాజీ సైనిక వైద్యుడైన రాణాకు 2008 దాడుల గురించి ముందే తెలుసని అంటారు. ఇదే సమయంలో.. 2009లో డెన్మార్ లో ఉగ్రవాద కుట్రకు పాల్పడి అరెస్టయ్యాడు.
ఈ డెన్మార్క్ కేసుతో పాటు లష్కరే తోయిబాకి సహాయం చేశాడనే అభియోగాలపై అతనికి శిక్ష పడింది. ఈ నేపథ్యంలో తాజాగా అతనిని భారత్ కు అప్పగించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు క్లియర్ చేసిందనే విషయం ఆసక్తిగా మారింది.
అర్ష్ డల్లా:
నిషేధిత ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ కూ చెందిన డీ-ఫాక్టో నేత, ఖలిస్తాన్ ఉగ్రవాది అర్ష దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ డల్లా.. భారత్ లో సుమారు 50కి పైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఉగ్రవాద చర్యలకు సంబంధించిన కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ప్రస్తుతం కెనడాలో ఉన్న అతడు 2004లో ఉగ్రవాదిగా పేర్కొన్నారు.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ.తో టచ్ లో ఉన్నట్లు చెబుతారు. గుర్తు తెలియని షూటర్ల దాడిలో గాయపడిన ఇతడిని గత అక్టోబర్ లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి భారత్ కు అతనిని అప్పగించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో $30,000 ష్యూరిటీ బాండ్ పై బెయిల్ పొందిన అతడు.. భారత్ కు మోస్ట్ వాంటెడ్ జాబితాలో రెండో ఉగ్రవాది!
అన్మోల్ బిష్ణోయ్:
గుజరాత్ లోని జైలు నుంచి భయంకరమైన బిష్ణోయ్ గ్యాంగ్ ను నడుపుతున్న లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడే ఈ అన్మోల్ బిష్ణోయ్. అన్న జైల్లో ఉన్నా.. గ్యాంగ్ కారకలాపాలు ఏ అడ్డూ అదుపూ లేకుండా సాగడంలో ఇతడిదే ప్రధాన పాత్ర అని అంటున్నారు. కెనడాలో ఉండి.. భారత్ లో కార్యక్రమాలు ఏ అడ్డూ అదుపూ లేకుండా జరుపుతున్నాడని అంటారు.
పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ ల హత్యలతో సహా పలు ఉన్నత స్థాయి కేసులకు సంబంధించి అతడిని భారత్ వెతుకుతుంది. అయితే.. అన్మోల్ ను గత నవంబర్ లో అమెరికాలో అరెస్ట్ చేశారు. దీంతో.. ఢిల్లీ నుంచి కస్టడీ రిక్వస్ట్ లు పంపుతున్నారని అంటున్నారు. ట్రంప్ తలచుకుంటే ఎంత సేపో పట్టదని చెబుతున్నారు!
విజయ్ మాల్యా:
పైన చెప్పుకున్న ముగ్గురూ ఓ తరహా ఉగ్రవాదులు అయితే.. ఇప్పుడు చెప్పుకోబోయే మిగిలిన ఇద్దరూ వారికి ఏమాత్రం తీసిపోని ఆర్థిక ఉగ్రవాదులు అని అంటారు. వారిలో ఒకరు విజయ్ మాల్యా! సుమారు రూ.9,000 కోట్ల రుణ ఎగవేత కేసును ఎదుర్కొంటున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. 2016లో భారత్ ను విడిచిపెట్టి యూకేలో తలదాచుకుంటున్నట్లు చెబుతారు.
ఇతడు 2019లో భారత్ నుంచి పారిపోయిన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఈ సమయంలో.. మాల్యా కస్టడీ కోసం భారత్ సుదీర్ఘ న్యాయపోరాటంలో ఉంది. అది త్వరలో ముగిసే అవకాశం ఉందని.. అతడిని భారత్ కు రప్పించే ఛాన్స్ ఉందని సీబీఐ వర్గాలు అంటున్నాయని అంటారు! ఈ విషయంలో కేంద్రంలోని పెద్దల చిత్తశుద్ధి కీలకం అని చెబుతుంటారు!!
నీరవ్ మోడీ:
విజయ్ మాల్యా అనంతరం బలంగా వినిపించే పేరు నీరవ్ మోడీ. ఇతడిని ఆర్థిక ఉగ్రవాదిగా చెబుతుంటారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో నీరవ్ మోడీ, అతడి మామ మోహుల్ చోక్సీలు కీలక నిందితులుగా ఉన్నారు. 2018లో దేశం విడిచి వెళ్లిన నీరవ్ మోడీ అదే ఏడాది లండన్ లో అరెస్టయ్యాడు. ఇప్పుడు యూకే జైల్లో ఉన్నాడని చెబుతారు.
ఈ నేపథ్యంలో ఆంటిగ్వాలో ఉంటున్నట్లు చెబుతున్న మోహుల్ చోక్సీతో పాటు నీరవ్ మోడీ భారతదేశానికి అప్పగించడాన్ని వ్యతిరేకించే పిటీషన్స్ అన్నీ అయిపోయాయని.. త్వరలో ఢిల్లీ తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.