టెర్రరిస్టు గ్రూప్ అధీనంలోకి యూఎన్ హెలికాప్టర్!
సోమాలియా టెర్రరిస్టు గ్రూప్ అల్ షబాబ్ గురించి చాలా మందికి పెద్దగా పరిచయం అవసరం లేదు.
By: Tupaki Desk | 11 Jan 2024 4:11 AM GMTసోమాలియా టెర్రరిస్టు గ్రూప్ అల్ షబాబ్ గురించి చాలా మందికి పెద్దగా పరిచయం అవసరం లేదు. అరబిక్ లో "యువత" అని అర్ధం వచ్చే అల్ షబాబ్, దాదాపు దశాబ్దంన్నర పాటు సోమాలియా అంతటా విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా ఐక్యరాజ్యసమితికి చెందిన హెలికాప్టర్ ను సోమాలియా టెర్రరిస్టు గ్రూప్ అల్ షబాబ్ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
అవును... తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఐక్యరాజ్యసమితి హెలికాప్టర్ ను బుధవారం సోమాలియాలో ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ నియంత్రణలో ఉన్న ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. సాంకేతిక సమస్య రావడంతో ఆ హెలికాప్టర్ ఉగ్రవాద సంస్థ నియంత్రణలోని ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండ్ కావడంతో ఈ ఘటన జరిగినట్లు సోమాలియా సైనిక అధికారులు తెలిపారు.
సోమాలియాలోని బెలెడ్ వేన్ పట్టణంలో బయలుదేరిన కాసేపటికే ఈ ఘటన జరిగినట్లు మిలిటరీ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఉన్న తొమ్మిది మంది ప్రయాణికుల్లో పలువురు విదేశీయులు ఉండగా, ఇద్దరు సోమాలియన్ లు ఉన్నారని సమాచారం.
సోమాలియాలోని ఐక్యరాజ్యసమితి సహాయ కార్యాలయం.. ఆఫ్రికన్ యూనియన్ ట్రాన్సిషన్ మిషన్ తో 19,000 మంది సభ్యుల శాంతి పరిరక్షక దళాలకు లాజిస్టికల్ మద్దతును అందిస్తుంది! అందులో భాగంగా ఆహారం, ఇంధనాన్ని రవాణా చేయడంతోపాటు ప్రమాదాలు జరిగినప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంది.
కాగా... అల్ ఖైదాకు అనుబంధ సంస్థగా చెప్పే అల్ షబాబ్.. 2006లో ఏర్పాటై సోమాలియాలో బలంగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2006లో ఏర్పాటైన ఈ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో ఇస్లామిక్ షరియా చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థలో దాదాపు 7,000 నుంచి 12,000 ఫైటర్స్ ఉంటారని అంచనా. ఈ సంస్థ దోపిడీ, పన్నుల ద్వారా సంవత్సరానికి $120 మిలియన్లను సంపాదిస్తుంది!