ఏపీకి టెస్లా వచ్చే ఛాన్సులెన్ని?
ఏపీలో టెస్లా యూనిట్ ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రోత్సాహాల జాబితాను కంపెనీ ప్రతినిధులకు వివరించటంతో పాటు.. తమ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తు ఉండే సానుకూలతల్ని వివరించినట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 Feb 2025 4:42 AM GMTఅమెరికా విద్యుత్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా భారత్ లోకి వచ్చేందుకు సిద్ధం కావటం.. దీనికి సంబంధించి పరిణామాలు వేగంగా కదలటం తెలిసిందే. ఇప్పటికే తన సంస్థకు సంబంధించిన రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కూడా మొదలైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టెస్లా యూనిట్ ను భారత్ లో ఎక్కడ ఏర్పాటు చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. ఎప్పటిలానే టెస్లాను ఏపీకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న టెస్లాను.. తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు పలు రాష్ట్రాలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి.
టెస్లా రాకతో ఎన్నో మార్పులు చోటు చేసుకోవటమే కాదు.. ఏ రాష్ట్రమైతే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందో.. భారీ ఆదాయం సొంతం కావటమే కాదు.. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు వీలు అవుతుంది. ఈ నేపథ్యంలో టెస్లా ఛాన్స్ ను మిస్ చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. టెస్లా యూనిట్ ను ఏపీలో ఏర్పాటు చేసే అవకాశాల్ని.. ఆ కంపెనీ ప్రతినిధులకు అర్థమయ్యేలా చెప్పటంతో పాటు.. తమ రాష్ట్రం వైపు ఆకర్షించేందుకు వీలుగా ఏపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.
అయితే.. టెస్లా కోసం తమిళనాడు.. తెలంగాణ.. గుజరాత్ తో పాటు మరిన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఏపీకి సంబంధించి ఆసక్తికర అంశం చోటు చేసుకున్న విషయం వెలుగుచూసింది. ఏపీలో టెస్లా యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొంత సఫలం అయినట్లుగా చెబుతున్నారు. టెస్లా ప్రతినిధులు.. ఉమ్మడి నెల్లూరుజిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని భూముల్ని పరిశీలించినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో టెస్లా యూనిట్ ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రోత్సాహాల జాబితాను కంపెనీ ప్రతినిధులకు వివరించటంతో పాటు.. తమ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తు ఉండే సానుకూలతల్ని వివరించినట్లుగా చెబుతున్నారు. ఏపీ రాష్ట్ర ప్రతిపాదనలపై టెస్లా స్పందన ఏమిటన్నది బయటకు రాలేదు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్.. టెక్సస్ లోని టెస్లా ప్రతినిధులతో భేటీ కావటంతో పాటు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఏపీ ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది.
తాము అనుకున్నది సాధిస్తే.. ప్రపంచ పటంలో ఏపీ మరోమారు అందరి చూపు పడేలా చేయటమే కాదు.. మరిన్ని పెట్టుబడులు ఏపీ బాట పట్టేందుకు వీలు అవుతుందని చెబుతున్నారు. అయితే.. ఇదంత తేలిక కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. టెస్లా యూనిట్ ను గుజరాత్ లో ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్రం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావటంతో.. ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాల్ని కొట్టి పారేయలేమంటున్నారు.
మొత్తంగా చూస్తే.. టెస్లా యూనిట్ సాధనలో గుజరాత్ తో పాటు ఏపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తమిళనాడు సైతం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూడు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సంస్థ కార్యాలయం పుణెలో ఏర్పాటు చేయటం తెలిసిందే. టెస్లా కానీ ఏపీకి వచ్చేందుకు సిద్దమైతే 15 వేల ఎకరాల వరకు భూములు ఇచ్చేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.