'టెస్లా' విషయంలో తగ్గేలేదు: చంద్రబాబు
ఇప్పటికే టెస్లా కోసం మూడు కీలక ప్రాంతాలను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. నెల్లూరులోని శ్రీసిటీ, కర్నూలులోని దొనకొండ, కడపలో కూడా స్థలాలను సిద్ధం చేయడంతోపాటు.
By: Tupaki Desk | 23 Feb 2025 5:55 AM GMTప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కార్ల కంపెనీ(విడిభాగాల తయారీ కేంద్రం)ని ఏపీకి తీసుకువచ్చే విషయంలో సీఎం చంద్రబాబు ఎక్కడా రాజీ పడరాదని నిర్ణయించుకున్నారు. గతంలోనే టెస్లాపై ఆయన చర్చించి ఉండడం.. మంత్రి నారా లోకేష్ గత నెలలో అమెరికాలో పర్యటించినప్పుడు కూడా.. టెస్లా ఆర్థిక వ్యవహారాలు చూసే డైరెక్టర్‌తో భేటీ అయి.. ఏపీకి దీనిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం తెలిసిందే. ఇక, తాజాగా టెస్లా ఇండియాకు వచ్చేందుకు రెడీ అయింది.
ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు కూడా టెస్లాపై కన్నేశాయి. ప్రధానంగా రెండు రాష్ట్రాల నుంచి టెస్లా కోసం .. భారీ పోటీ కనిపిస్తోంది. ఈ రెండు కూడా.. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలే కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా టెస్లా కోసం తపిస్తున్నాయి. పైగా.. ఈ రెండు రాష్ట్రాలు కూడా పారిశ్రామికంగా.. ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నేపథ్యంలో టెస్లా వ్యవహారం ఎటు మళ్లుతుందోన న్న చర్చ సాగుతోంది. పైగా.. ఈ రెండు రాష్ట్రాలకు కూడా తీర ప్రాంతం ఉండడం గమనార్హం.
ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే.. ప్రపంచ స్థాయిలో పెద్ద పేరు తెచ్చుకున్న టెస్లా.. ఇండియాకు వస్తే.. దానిని తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించేందుకు ప్రధాని మోడీ రెడీగా ఉన్నారన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇలా.. టెస్లా మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు పోటా పోటీగా ముందుకు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు.. ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయంలో వెనక్కి తగ్గరాదని.. కేంద్రంలోని కూటమిపై అవసరమైతే..వత్తిడి తీసుకురావాలని కూడా బాబు నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే టెస్లా కోసం మూడు కీలక ప్రాంతాలను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. నెల్లూరులోని శ్రీసిటీ, కర్నూలులోని దొనకొండ, కడపలో కూడా స్థలాలను సిద్ధం చేయడంతోపాటు. విద్యుత్, నీరు వంటిసదు పాయాలను తొలి నాలుగేళ్లు పూర్తి ఉచితంగా ఇచ్చే ప్రతిపాదన కూడా ఉందని తెలుస్తోంది. అయితే.. అంతర్జాతీయ స్తాయిలో వస్తున్న పెట్టుబడులను ప్రధాని మోడీ తన సొంతరాష్ట్రానికి తరలించుకుం టున్న నేపథ్యంలో టెస్లా విషయంలో ఏం చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ విషయంలో మోడీని బాబు ఒప్పిస్తే.. ఏపీకి ఖచ్చితంగా టెస్లా ఒక మణిమకుటం అనడంలోసందేహం లేదు.