Begin typing your search above and press return to search.

ప్రపంచం ఆశ్చర్యం... టెస్లా రోబో వ్యాన్, సైబర్ ట్యాక్సీని చూశారా?

నేలపై కారైనా.. అంతరిక్ష ప్రయాణమైనా.. ఈ ప్రపంచానికి మస్క్ ఇచ్చే సర్ ప్రైజ్ లు మామూలుగా ఉండవని అంటుంటారు.

By:  Tupaki Desk   |   11 Oct 2024 1:30 PM GMT
ప్రపంచం ఆశ్చర్యం... టెస్లా రోబో వ్యాన్, సైబర్  ట్యాక్సీని చూశారా?
X

అద్భుతమైన సాంకేతికతతో, తనదైన సృజనాత్మకతతో ప్రపంచాన్ని పలు రకాలుగా ఆశ్చర్యపరచడంలో టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నిత్యం ముందుంటారనే సంగతి తెలిసిందే. నేలపై కారైనా.. అంతరిక్ష ప్రయాణమైనా.. ఈ ప్రపంచానికి మస్క్ ఇచ్చే సర్ ప్రైజ్ లు మామూలుగా ఉండవని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా రెండు వాహనాలు వదిలారు మస్క్!

అవును... ప్రపంచానికి ఒకేసారి రెండు సర్ ప్రైజ్ లు ఇచ్చారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తాజాగా ఆ సంస్థ రూపొందించిన రోబోవ్యాన్, సైబర్ ట్యాక్సీ మోడల్స్ ని ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ కాంపౌండ్ లో నిర్వహించిన "వీరోబో" కార్యక్రమంలో పాల్గొన్న మస్క్... ఈ రోబో వ్యాన్, సైబర్ ట్యాక్సీ మోడల్స్ ను ఆవిష్కరించారు. దీంతో ప్రపంచానికి సర్ ప్రైజ్ ఇచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వీటిలో రోబో వ్యాన్ అనేది సాధారణ డిజైన్లకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ వ్యాన్ మైలు దూరం ప్రయాణించడానికి 5 నుంచి 10 సెంట్ల వరకూ ఖర్చవుతుందని.. దీనిలో 20 మంది ప్రయాణికులను, సరుకులను తరలించేందుకు వాడుకొవచ్చని టెస్లా బృందం తెలిపింది. ఇందులో చక్రాలు బయటకు కనిపించకుండా డిజైన్ చేశారు. ఈ రోబో వ్యాన్ లో కూడా సైబర్ క్యాబ్ మాదిరిగానే స్టీరింగ్ వీల్ లేదు!!

ఇక రోబో ట్యాక్సీ విషయానికొస్తే... రెండు డోర్లతో ఉన్న ఈ కారుకు స్టీరింగ్ వీల్ తో పాటు పెడల్స్ కూడా ఉండవు. దానిని మస్క్ సైబర్ క్యాబ్ అని పరిచయం చేశారు. దీని తయారీ 2026 నుంచి మొదలవుతుందని చెబుతున్నారు. దీన్ని 30,000 డాలర్లకంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ఇక ఇందులో మైలు ప్రయాణానికి 20 సెంట్ల వరకూ ఖర్చవుతుందని తెలిపారు.